అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సేవా "గంధం"...కరోనా బాధితుల పాలిట "చంద్రుడు": అనంత కలెక్టర్‌పై సర్వత్రా ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అధికారే అక్కడి వారికి ఆత్మీయుడు. ఆ ఐఏఎస్ ఆ జిల్లాలో సూపర్ వారియర్. ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షలు కాదు..క్షేత్ర స్థాయిలో బాధితులకు ఊరటనివ్వటమే అసలు బాధ్యత అని గుర్తించారు. పేరులో ఉన్న విధంగానే కరోనా సేవల్లో తన కలెక్టర్ హోదాను ఏరకంగా సద్వినియోగం చేయవచ్చో నిరూపించారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. కరోనా కేసులు అనంతపురం జిల్లాలో అనూహ్యంగా పెరిగిపోయాయి. దీనికి అసలు సమస్యను గుర్తిస్తూనే..బాధితులకు ఓదార్పు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తీసుకున్న నిర్ణయాలు..వ్యక్తిగత శ్రద్ద మంచి ఫలితాలనిచ్చాయి. కేవలం కరోనా టెస్టులు.. చికిత్సకే ఆయన పరిమితం కాలేదు. కరోనా బాధితులకు మానసిక ఆవేదన దూరం చేసేందుకు..మందులు కొనుగోలు మొదలు..ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించే వరకూ ప్రతీ అంశంలోనూ క్రియా శీలకంగా మారారు. ఆయనను కేంద్ర ప్రభుత్వ ప్రశంసించింది. కాగా, అనంత జిల్లా వాసులు సేవా గంధంగా పిలుచుకుంటున్నారు.

 మందుల రాయితీ మొదలు వ్యక్తిగత ప్రశంసల దాకా..

మందుల రాయితీ మొదలు వ్యక్తిగత ప్రశంసల దాకా..

గంధం చంద్రుడు జిల్లా కలెక్టర్ అయినా సేవ పరంగా మాత్రం అందరినీ సమన్వయం చేసుకుంటూ..కొన్ని సందర్భాల్లో తనకు తాను వినూత్నంగా ఆలోచనలు చేసి కోవిడ్ పరిస్థితుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కలెక్టర్ గంధం చంద్రుడు కలెక్టొరేట్‌లోని తన కార్యాలయానికే పరిమితం కాలేదు. తన కార్యాలయంలోనే కూర్చొని కేవలం కోవిడ్ రోగులు..పరీక్షల లెక్కల కోసం మాత్రమే పని చేయలేదు. ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బాధితులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. వారికి తగినట్లుగా వాటిని ఏర్పాటు చేయటంతో వినూత్నంగా వ్యవహరించారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకొనేందుకు ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి..వాటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. తగిన విధంగా ప్రణాళికలు సిద్దంచేశారు. మందుల షాపుల వారిని ఒప్పించారు. మందుల కొనుగోళ్లలో రాయితీలు ఇప్పించి బాధితులకు ఊరటనిచ్చారు. అదే విధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వారిని వ్యక్తిగతంగా ప్రోత్సహించారు. వారికి తన స్వదస్తూరితో సిద్దం చేసిన గ్రీటింగ్ కార్డులను ఆషా వర్కర్లు మొదలు వీఆర్వో..గ్రామ సచివాలయ ఉద్యోగులు..వాలంటీర్లకు పంపుతున్నారు. కలెక్టర్ స్వయంగా పంపటం వారిలో మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. కార్డుతో పాటుగా ఒక మొక్కను కూడా బహుమతిగా ఇస్తున్నారు.

 వినూత్న ఆలోచనకు అనంత కలెక్టర్ పై హర్షం

వినూత్న ఆలోచనకు అనంత కలెక్టర్ పై హర్షం

ఇక కోవిడ్ కష్టకాలంలో ఆర్థికంగా నష్టపోకూడదని ఒక వినూత్న ఆలోచన చేశారు కలెక్టర్ గంధం చంద్రుడు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించకుండా వ్యాపారులే కస్టమర్లకు డిస్కౌంట్‌లు ప్రకటించేలాంటి వినూత్నమైన పద్ధతిని తీసుకొచ్చారు. తద్వారా ఇటు వ్యాపారస్తులు నష్టపోకుండా అటు కస్టమర్లకు కావాల్సిన నిత్యవసరాలు కూడా దొరికేందుకు దోహదం చేసేలా ఆ ఆలోచన ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించే కస్టమర్లకు డిస్కౌంట్లు ఇస్తామంటూ దుకాణాల ముందు బ్యానర్లు వెలిశాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం , శానిటైజర్లను వినియోగించడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నవారికి డిస్కౌంట్లు ఇస్తామంటూ బ్యానర్లు దుకాణాల ముందు కనిపిస్తున్నాయి.

 బాధితులకు అండగా కలెక్టర్ గంధం చంద్రుడు

బాధితులకు అండగా కలెక్టర్ గంధం చంద్రుడు

కరోనావైరస్ సెంటర్లలో బాధితులు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారని తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు వీరికోసం మంచి ఆలోచన చేశారు. మానసికంగా ఉల్లాసంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటే పేషెంట్లలో ఒంటరితనం అనేది దూరం అవుతుందని భావించిన కలెక్టర్ చంద్రుడు... ఒక మ్యూజిక్ సిస్టంను కోవిడ్ కేర్ సెంటర్లలో అమర్చారు. మంచి సంగీతం వింటూ పేషెంట్లు ఒంటరి తనాన్ని మర్చి పోతున్నారు. అంతేకాదు టెన్నిస్, షటల్, వాలీబాల్, క్యారమ్స్‌లాంటి ఇండోర్ గేమ్స్‌ను కూడా కోవిడ్ సెంటర్లలో పరిచయం చేశారు. ఇష్టమున్న వారు ఇష్టమొచ్చిన గేమ్స్ ఉదయం సాయంత్రం ఆడేలా వీలు కల్పించారు. అంతేకాదు కరోనావపేషెంట్లలో కాన్ఫిడెన్స్ నింపేలా కౌన్సిలర్లను సైతం ఏర్పాటు చేశారు. ఆయన చేసిన సేవల డాక్యెమెంటరీని చూసిన కేంద్ర ప్రభుత్వం కలెక్టర్ ను అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కలెక్టర్ చొరవను అభినందించింది.

మౌనంగానే ఎదగమని ..ఎదిగిన కొద్ది ఒదగమనే అర్దం అందులో ఉంది అనేది చెప్పకుండానే చెప్పారు గంధం చంద్రుడు. ఇక, నిర్విరామంగా పని చేస్తన్న వారియర్స్ కు వెసులుబాటు కల్పించారు. ఇదే సమయంలో కోవిడ్ నియంత్రణ కోసం కఠిన చర్యలను అమలు చేసారు. ఇలా... ఒక అధికారిగా..మానవత్వం ఉన్న వ్యక్తిగా.. జిల్లా తొలి పౌరుడిగా గంధం చంద్రుడు కోవిడ్ వేళ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

English summary
With Innovative thoughts during the Covid-19 pandemic,Anantapur Collector Chandrudu is praised by all
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X