పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్లో యువకుడు బలవన్మరణం
హైదరాబాద్: కలిసుండాలనే తమ కోరికను కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల జిల్లాలోని గొళ్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళ ఆత్మహత్యకు పాల్పడగా, ఆ విషయం తెలిసి దుబాయ్లో ఉన్న ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
21ఏళ్ల మనీషా అనే యువతి కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయం తెలిసిన రాకేష్ అనే ఆమె ప్రియుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమించుకున్న రాకేష్, మనీషాలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. పెద్దలు అందుకు అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆత్మహత్యకు పాల్పడే ముందు మనీషా లేకుండా తాను జీవించలేనని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు రాకేష్. ఆ వీడియోలో మనీషా మరణవార్త తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. ఉపాధి కోసం ఇటీవలే రాకేష్ దుబాయికి వెళ్లాడు. ఇరువైపులా కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్న ఆ జంట కోరిక నెరవేరకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ప్రేమ జంట ఆత్మహత్య
ఇది ఇలావుండగా, నిజామాబాద్ జిల్లాలోనూ ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నందిపేట్ మండలం కుద్వాస్పూర్ గ్రామానికి చెందిన సుకన్య సోమవారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి మరణవార్త తెలిసిన ప్రియుడు ప్రేమ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురై గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి విషయంలో వచ్చిన మనస్పర్థలే వారి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.