సీఎం ప్రసంగిస్తుండగా సభను వీడిన మహిళలు: తడబడిన జగన్, జనం పరార్ అంటూ లోకేష్ సెటైర్
ఏలూరు: జిల్లాలోని గణపవరంలో సోమవారం వైయస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తుండగా.. మధ్యలోనే కొందరు మహిళలు లేచి వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణం కొంతమేర ఖాళీగా మారింది.

ఆపినా ఆగకుండా వెళ్లిపోయిన మహిళలు..
అయితే, కొందరు పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, పోలీసులు.. ఆ మహిళలను ఆపేందుకు ప్రయత్నించారు. సీఎం ప్రసంగం తర్వాత వెళ్లాలని కోరారు. అయితే, మహిళలు మాత్రం వారి మాట వినకుండా వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ సభలో.. జనం పరుగో పరుగు అంటూ నారా లోకేష్ సెటైర్లు
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పంచుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. జగన్ దెబ్బకి జనం పరార్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ నేతలు కూడా ఈ వీడియోను షేర్లు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి.. రైతుల్లేని రాజ్యంగా ఆంధ్రప్రదేశ్‌ని జగన్ రెడ్డి మార్చారని లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభం.. రైతులపై జరిగిన దాష్టీకాలకు సీఎం.. సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక గడప గడపకు వెళుతున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతున్నారన్నారు.
ప్రసంగంలో తడబడిన సీఎం జగన్.. టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు
ఇది ఇలావుండగా, ప్రసంగం సమయంలో కాస్త తడబడ్డారు సీఎం జగన్. డబ్బు అనే బదులు డమ్ము అని, పట్టాదారు పాస్ బుక్కు బదులు పుస్త బుక్ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పాస్ పుస్తకం అని సరిదిద్దుకున్నారు. అయితే, కొందరు టీడీపీ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్లు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.