నా లాంటివాడైతే కోసి కారం పెడతాడు: మహిళలను వేధించేవారికి మంత్రి అప్పలరాజు వార్నింగ్
హైదరాబాద్: మహిళలను వేధిస్తే తాను చూస్తూ ఊరుకోనని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. శ్రీకాకుళంలో దిశ యాప్ డౌన్లోడ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో అప్పలరాజు పాల్గొన్నారు. మహిళలతోపాటు పురుషులు కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారు.
మహిళలను వేధించేటప్పుడు తన లాంటి అన్న పక్కన ఉంటే అలాంటి వ్యక్తికి కోసి కారం పెడతాడని అన్నారు మంత్రి అప్పలరాజు. 'ఏదైనా సందర్భంలో ఎవరైనా మహిళలు బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తుండవచ్చు. ఆ సమయంలో ఎవరైనా ఈవ్ టీజర్ వేధింపులకు పాల్పడవచ్చు. ఫిర్యాదు చేసేందుకు దగ్గర్లో పోలీసులు ఉండకపోవచ్చు. మహిళ చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా ఉండి ఉండకపోవచ్చు. మరి, అలాంటి సందర్భంలో నా లాంటి అన్న ఉంటే.. నా ఫోన్ లో దిశ యాపే ఉంటే ఆ ఈవ్ టీజర్‌కు కోసి కారం పెడతాడు'' అని వ్యాఖ్యానించారు మంత్రి అప్పలరాజు.

ప్రతి గ్రామంలో ఉన్న మహిళా పోలీసులు.. మహిళలను కూర్చోబెట్టి యాప్ ఇన్స్టాల్ చేసుకునేలా చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను నియమించిన ఘనత మన అన్న జగనన్నేనని అన్నారు. మహిళలకు జగన్ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పాడుపడుతోందన్నారు.
కాగా, యాప్ డౌన్ లోడింగ్ కార్యక్రమంలో మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు నైనా జస్వాల్‌ను పూలమాలలు వేసి సత్కరించారు.
ఇటీవల ఏపీలో మహిళలపై వరుసగా అత్యాచార ఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సర్కారు వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మహిళలు, యువతులు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మంత్రులు, అధికారులు కోరుతున్నారు. దిశ యాప్ ద్వారా మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టవచ్చని చెబుతున్నారు.