3రాజధానులు, సీఆర్డీఏపై హైకోర్టు తీర్పుతో జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: టీడీపీ నేతలు
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు వెల్లడించింది. గురువారం నాడు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పై కీలక తీర్పును వెలువరించిన హైకోర్టు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. మాస్టర్ ప్లాన్ ను ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలని రాజధాని పై ఎలాంటి చట్టాలను చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు వెల్లడించింది.
కొత్త జిల్లాలపై 7,500 అభ్యంతరాలు; అత్యధికంగా ఆ జిల్లా నుండే: ప్రణాళికాశాఖ కార్యదర్శి

రాజధాని అమరావతిని అభివృద్ధి చెయ్యాలి
రాజధాని అమరావతిని ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిక అందజేయాలని తీర్పులో వెల్లడించింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేస్తుంది.

హైకోర్టు తీర్పుతో కనువిప్పు కలగాలి : యనమల రామకృష్ణ్దుడు
తాజాగా మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు రాజధాని అంశం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ముందునుంచి మూడు రాజధానులు బిల్లు చెల్లదని చెబుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, 3 రాజధానులపై ముందుకు వెళ్లిందని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని యనమల రామకృష్ణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మూడు రాజధానుల నిర్ణయం అనాలోచిత నిర్ణయం: యనమల
హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకెళ్లాలని పేర్కొన్న యనమల మరో అప్పీలుకు వెళ్ళకూడదని జగన్ సర్కార్ కు హితవు పలికారు. హైకోర్టు చెప్పిన విధంగా రాజధాని భూముల అభివృద్ధి చేసి, ప్రభుత్వం రైతులకు అప్పగించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 3 రాజధానుల నిర్ణయం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం గా యనమల రామకృష్ణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని యనమల పేర్కొన్నారు. ఇప్పటికైనా మూడు రాజధానులు ఆలోచనను విరమించుకుని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని యనమల రామకృష్ణుడు ప్రభుత్వానికి సూచించారు.

మళ్ళీ మూడు రాజధానుల బిల్లు పెడతారనుకోవటం లేదు : మాజీ శాసనమండలి చైర్మన్
ఇక ఇదే సమయంలో మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంత భంగపాటుకు గురైన తర్వాత మళ్ళీ బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇది అమరావతి రైతులు సాధించిన నైతిక విజయమని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ వెల్లడించారు. గతంలో శాసనమండలిలో నిబంధనల ప్రకారమే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపామని ఆయన పేర్కొన్నారు. కానీ తన నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టిందని, ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పు తో టీడీపీ వాదన కరెక్ట్ అని తేలిందని షరీఫ్ పేర్కొన్నారు.