వైయస్ జగన్ పాలనలో మిగిలిందిదే .. ఏపీ ఆర్ధిక సంక్షోభంపై యనమల ఫైర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది అని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి అపసవ్య విధానాలతో,అవినీతి కుంభకోణాలతో రాష్ట్రం చిన్నాభిన్నంగా మారుతోందని యనమల ఆరోపించారు. వైసిపి చేతగానితనంతో రాష్ట్రానికి చేటు చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు . ఆర్ధికంగా ఏపీ దారుణ స్థితిలో ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు .

16 నెలల్లో ప్రజలపై 20 వేల కోట్ల ఆర్థిక భారం
వైయస్ జగన్ పాలనలో వైసీపీ నాయకులకు సుఖాలు, ప్రజలకు దుఃఖాలు మిగిలాయి అంటూ యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు.16 నెలల్లో ప్రజలపై 20 వేల కోట్ల ఆర్థిక భారం మోపారని యనమల లెక్కలు చెప్పారు.ఎగుమతుల ప్రోత్సాహక ఇండెక్స్ లో ఏపీ 21 వ స్థానానికి దిగజారిందని యనమల వ్యాఖ్యానించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 363 శాతం ఏపీకి అప్పులు పెరిగాయన్నారు. ఇది ఏ మాత్రం రాష్ట్రానికి మంచిది కాదన్నారు .

శాండ్ ల్యాండ్ మాఫియా , వైన్ మైన్ మాఫియా పెరిగాయన్న యనమల
ప్రభుత్వం జగన్ కోసం, జగన్ కొరకు ,జగన్ చేత మాత్రమే ఉందని ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత కాదని యనమల మండిపడ్డారు. రాష్ట్రంలో సహజ వనరులను వైసీపీ మాఫియా దోచుకుంటున్నారని, ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాండ్ ,ల్యాండ్ మాఫియా , వైన్, మైన్ మాఫియా రాష్ట్రంలో పెరిగిపోయాయని యనమల రామకృష్ణుడు అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు పోయి, ఉద్యోగాల కల్పన లేక యువత తీవ్ర నిరాశకు గురవుతుంది అని పేర్కొన్నారు.

అభివృద్ధి కోసమే అప్పులు చెయ్యాలి కానీ ఖర్చుల కోసం కాదు
కరోనా సంక్షోభం లోనూ ఏపీ ప్రభుత్వం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోందని తెలిపారు. అభివృద్ధి అంటే ఆర్థిక,సాంఘిక,సాంస్కృతిక,రాజకీయ రంగాల సమగ్రాభివృద్ధి అని తెలిపిన యనమల రామకృష్ణుడు అభివృద్ధి పనులపై, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పెట్టుబడులు రావడంలేదని, కొత్త పరిశ్రమల స్థాపన లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక అభివృద్ధికి అప్పులు తీసుకోవాలి కానీ అనుత్పాదక వ్యయానికి అప్పులు తీసుకోకూడదు అన్న ఆర్థికవేత్త జాన్ కీన్స్ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను నెట్టిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి అపసవ్యదిశలో ప్రభుత్వాన్ని నడిపించవద్దంటూ యనమల హితవు పలికారు.