steel plant protests ayyannapatrudu tdp leader jagan vijayasai reddy conspiracy ys jagan sales plots pm modi ycp స్టీల్ ప్లాంట్ నిరసనలు అయ్యన్నపాత్రుడు జగన్ విజయసాయి రెడ్డి కుట్ర వైయస్ జగన్ అమ్మకాలు ప్లాట్లు పిఎం మోడీ వైసిపి Visakhapatnam Steel Plant
పోస్కోతో చీకటి ఒప్పందాలు వైసీపీకి ముందే తెలుసు, జగన్ మొదటి ముద్దాయి : టీడీపీ నేతల ఫైర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో అధికార ,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతూనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కార్మికులకు, ఉద్యోగులకు మద్దతుగా పోరు బాట పట్టాయి. ఇక తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముందే తెలుసు అని, జగన్మోహన్ రెడ్డికి తెలిసిన తర్వాతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.

పోస్కో కంపెనీతో సీఎం జగన్ చీకటి ఒప్పందం: అయ్యన్న ఫైర్
టిడిపి నేతలు విమర్శలకు కౌంటర్ గా వైసీపీ నేతలు టిడిపి హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియకు బీజం పడింది అని చెబుతున్నారు. తాజాగా టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పోస్కో కంపెనీతో సీఎం జగన్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర చేయాల్సింది విశాఖలో కాదని ఢిల్లీలో పాదయాత్ర చేయాలని సూచించారు.

విశాఖ వచ్చి కార్మికులను కలవకుండా దొంగ స్వామిని కలిశారు
జగన్ విశాఖ నగరానికి వచ్చి దొంగ స్వామిని కలిశారని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు కార్మికులను కలవకుండానే వెళ్ళిపోయాడన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో ఏడు వేల ఎకరాలను విక్రయించాలని కేంద్రానికి సూచించానని చెప్పటం సరికాదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇలాంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గుచూపుతున్న వైసిపికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని , విశాఖ ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ : పట్టాభి
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2019 జూన్ లో పోస్కో ప్రతినిధులతో సమావేశమై 2019 జూలై లో ఆ సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోజల్ అందజేశారని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారని, అక్టోబర్లో ఎంవోయూ చేసుకున్నారని చెప్పారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి .

జగన్ , విజయసాయికి తెలిసే ఇదంతా : టీడీపీ నేతల ఆరోపణలు
స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ప్రతి ప్రధాన ఘట్టం వెనుక జగన్, విజయసాయిరెడ్డి ఉన్నారని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు . జగన్ కు తెలిసే ఇదంతా జరుగుతుందని ఆరోపిస్తున్నారు .