
చంద్రబాబునాయుడిపై YCP, BJP త్రిశూల వ్యూహం?
త్రిశూల వ్యూహం అనేది మహాభారత యుద్ధంలో అనుసరించిన ఒక వ్యూహం. యుద్ధం చివరిరోజు(18వ రోజు) పాండవులు ఈ వ్యూహాన్ని అనుసరించి విజయం సాధిస్తారు. తిరగేసిన V ఆకారంలో రాజ్యానికి వెళ్లేదారిని ఒక సైన్యం రక్షిస్తుంటుంది. అదే సమయంలో కుడివైపు నుంచి, ఎడమ వైపు నుంచి మరో రెండు సైన్యాలు వేర్వేరుగా వెళ్లి శత్రు రాజువద్ద కలుసుకోవాలి.
రెండువైపుల నుంచి వచ్చిన సైన్యాలను చూసి రాజుకు ఏం జరిగిందీ అర్థం కాదు. ఆ సైన్యాలతో యుద్ధం చేయలేక రాజు ఓడిపోతాడు. సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే ఈసారి ఎన్నికలకు చంద్రబాబునాయుడిపై YCP, BJP నేతలు ఉపయోగించబోతున్నారని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

YCPకి ఎంత ముఖ్యమో BJPకి అంతే ముఖ్యం!!
2024లో జరిగే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి అత్యంత కీలకమైనవి. ఎలాగైనా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించాలనే పట్టుదలను అధికార వైసీపీ ప్రదర్శిస్తుండగా, బాబు అంటే పడని బీజేపీ నుంచి సహకారం తీసుకోవాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం 2024లో టీడీపీని ఓడించగలిగితే 2029లో జనసేన-బీజేపీ కూటమిదే అధికారం అన్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి చంద్రబాబును ఓడించడం వైసీపీకి ఎంత ముఖ్యమో.. బీజేపీకి కూడా అంతే ముఖ్యం.

అభ్యర్థులకు ఏవీ అందకుండా దిగ్బంధనం?
తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా దిగ్బంధనం చేస్తారు. దీనికోసం ఐటీ, ఈడీని, అవసరమైతే సీబీఐని ఉపయోగిస్తారు. పార్టీ అభ్యర్థులకు ఎటువైపు నుంచి ఆర్థికంగా అండదండలు అందకుండా చూస్తారు. ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులకు ఏమేం కావాలో అవన్నీ అందనిరీతిలో ప్రణాళిక ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడంవల్లే చాలా నియోజకవర్గాల్లో అతి తక్కువ మెజారిటీతో ఓటమి పాలైంది.

అన్నివైపుల నుంచి ముట్టడి?
ఎన్నికల సమాయానికి ఆరునెలల ముందునుంచే ఈ ప్రణాళిక అమలవుతుంది. అంతేకాకుండా చంద్రబాబును ఏకాకిని చేయడానికి జనసేనతో పొత్తు లేకుండా చేయడం, తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండదండలందించేవారిని దాడులతో బెంబేలెత్తించడం. వీటిద్వారా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
టీడీపీకి వచ్చే విరాళాలపై ఇప్పటికే ఐటీ, ఈడీ ఓ కన్ను వేసి ఉంచాయి. విదేశాల నుంచి అందే నిధులపై ప్రత్యేక నిఘా ఉంచారు. టీడీపీకి ఎవరెవరి దగ్గర నుంచి విరాళాలు అందే అవకాశం ఉందన్న వివరాలు ఇప్పటికే వైసీపీ బీజేపీకి అందించిందని, ఇవి కాకుండా అన్నివైపుల నుంచి దిగ్బంధనం చేస్తేనే విజయం సాధించగలమనే యోచనలో ఉన్నారు.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను చంద్రబాబు విషయంలో వర్తింప చేయాలని, రాజకీయాల్లో తలపండిన బాబు విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటమే మంచిదనే యోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు.