వైసీపీ నేత తెలివితేటలు: గడప గడపకు గడియారం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం గడప గడపకు ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఏడాది పాటు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతోపాటు ప్రభుత్వం తరఫున అధికారులు పాల్గొని ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి చెబుతారు. అయితే గడప గడపకు ప్రభుత్వం కాదని, గడప గడపకు నిరసన అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

గడప గడపకు గడియారం
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాత్రం ఈ కార్యక్రమాన్ని తనకు అనువుగా మార్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మొదటి నుంచి పునాది వేసుకోవడానికి ఆయనకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతోంది. గడప గడపకు ఆయన తిరుగుతున్నారు. అందరికన్నా వేగంగా వెళుతున్నారు. తన వెంట తెచ్చుకున్న గడియారాలను ప్రతి గడపకు బహుమతిగా ఇస్తున్నారు.

బహుమతులతో ప్రజలను మంచి చేసుకుంటున్నారు
ఆయన వెళుతున్న ప్రతి చోట ప్రజలు కూడా ఎక్కువగానే వస్తున్నారు. బహుమతులతో ఆయన ప్రజలను మంచి చేసుకుంటున్నారు. అదేపార్టీలోని తన ప్రత్యర్థులు దీనిపై నిలదీయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వమే గడప గడపకు తిరగమంది కాబట్టి తిరుగుతున్నానంటున్నారు.

సాయిరెడ్డి అండతో సీతంరాజు.. వాసుపల్లి అసహనం
విశాఖ దక్షిణం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్ అధికార పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీతంరాజు వ్యవహారశైలిపై ఇప్పటికే గణేష్‌కుమార్ మండిపడుతున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండ చూసుకొని సీతంరాజు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన్ని కట్టడి చేయాలని వాసుపల్లి డిమాండ్ చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే రాజ్యసభ సభ్యులవల్ల కాదని, ఎమ్మెల్యేలవల్లేననే విషయం తెలుసుకోవాలంటూ కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. కానీ సీతంరాజు సుధాకర్ మాత్రం రాబోయే ఎన్నికల్లో ఇక్కడినుంచి తానే పోటీచేయబోతున్నానంటూ క్యాడర్‌కు చెబుతున్ఆరు. అందుకు తగ్గట్లుగా తన పని తాను చేసుకుపోతున్నారు. మరి జగన్ ఎవరికి సీటిస్తారో..??