ఆత్మకూరు ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి జగన్‌కు వెన్నుపోటు పొడిచిన వైసీపీ నేతలు?
ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,742 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లక్ష మెజారిటీ రావాలి.. అధికార పక్షంపై ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు అని ప్రతిపక్షాలకు నిరూపించడానికి దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక సవాల్‌గా స్వీకరించారు. గ్రామాలవారీగా, మండలాలవారీగా మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ సీనియర్ నేతలను ఇన్ఛార్జిలుగా పెట్టి ప్రచారం చేయించారు. అయినా లక్ష మెజారిటీ మాత్రం రాలేకపోయింది.

రోజా మినహా హ్యాండిచ్చిన మంత్రులు, మాజీ మంత్రులు?
మెజారిటీ రాకపోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతల వెన్నుపోటే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాధ్యతలు అప్పగించిన జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, కొడాలి నాని ఎటువంటి ప్రచారం చేయలేదని విమర్శలు వస్తున్నాయి. వీరంతా మొక్కుబడిగా ఏదో ఒక గ్రామంలో తిరగడం మినహా చేసిందేమీలేదని వైసీపీ నేతలే చెబుతున్నారు. తూతూ మంత్రంగా ఎక్కడో ఒకచోట తిరిగి మీడియా సమావేశం పెట్టి వెళ్లిపోయేవారని, అది కూడా ఎందుకంటే తాము కూడా ప్రచారం చేశామని చెప్పుకోవడం కోసమేనని వైసీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి రోజా మాత్రమే తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిదని పార్టీ నేతలు చెప్పారు.

జిల్లా మంత్రి, ఎంపీ చేసిందేమీ లేదు!!
జిల్లా మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్ నిర్ధేశించిన లక్ష మెజారిటీని సాధించే దిశగా పనిచేయాలి.. చేయించాలి. కానీ ఆయన ఆ దిశగా ఏ మాత్రం పనిచేయలేదని ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అలాగే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకోలేదని సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం తీసుకోవాల్సిన చొరవను కూడా ఆయన తీసుకోలేదని తెలుస్తోంది.

చర్యలు తీసుకుంటారా? వదిలేస్తారా?
గెలుపుకన్నా మెజారిటీపైనే ముఖ్యమంత్రి జగన్ దృష్టిపెట్టారు. అందుకు భారీగా యంత్రాంగాన్ని ఉపయోగించారు. అయినా లక్ష్యానికి దూరంగా నిలిచిపోయారు. దీనికి కారణం ఏమిటనే విషయమై ఇంటిలిజెన్స్ నివేదికలన్నీ తెప్పించుకొని క్రోడీకరించగా పై వివరాలన్నీ వెల్లడయ్యాయి. ఇప్పుడు వీరిమీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదంటే పార్టీ గెలిచింది కదా? అనే ఉద్దేశంతో వదిలేస్తారా? అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.