విపక్షాలు గుంపుగా వచ్చినా బెదిరేది లేదు.. జగన్ చేతిలో గుణపాఠం తప్పదు : శ్రీకాంత్ రెడ్డి
ఏపీలో బీజేపీ ఎన్ని మీటింగులు పెట్టినా.. ర్యాలీలు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వారికి రాష్ట్రంలో ప్రజా బలం లేదన్నారు. కడపలో బీజేపీ నేతృత్వంలో నిర్వహించిన రాయలసీమ రణభేరిపై విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీకి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను ఏపీకి ఎందుకివ్వలేదో బీజేపీ నేతలు చెప్పాలని నిలదీశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయొద్దని మొత్తుకుంటున్నా.. లాభం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీకి అజెండా లేదు..
కడపలో బీజేపీ రాయలసీమ రణభేరికి జెండా , అజెండా లేదని.. దానిని కేవలం సీఎం జగన్ ను విమర్శించేందుకే పెట్టారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ ఆటలు సాగవని.. ఎన్ని మీటింగులు పెట్టినా బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. కమలం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలేదని ఎద్దేవా చేశారు. రాయలసీయ అభివృద్ధికి వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ముందడుగు పడిందని పేర్కొన్నారు. పోత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్సార్ దే అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సీఎం జగన్ మరింత మేలు చేసే ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రం సహకరించడంలేదని ఆరోపించారు. అందుకే ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ముందుకు సాగడం లేదని దుయ్యబట్టారు.

కేంద్రాన్ని నిలదీసే దమ్ము పవన్ కు లేదు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నా వైసీపీకి వచ్చే నష్టమేమీలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు . ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ మూడు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ .. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విజ్ఞత లేకుండా ప్రతిది వైసీపీ ప్రభుత్వంపై నేపం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో విధంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు విశ్వసించడంలేదని ఎద్దేవా చేశారు.

ఏపీకి శాశ్వత సీఎం జగనే
రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీలో సమ్యలను పరిష్కరించడం చేతగాని బీజేపీ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. విభజన చట్టంలో ఉన్న ఏ సమస్యనూ ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. రాయల సీమ అభివృద్ధికోసమే ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పారు. కానీ విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటూ పబ్బం గుడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. విపక్షాలకు మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.