నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించిన విజయసాయిరెడ్డి, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వ్యతిరేకించామే తప్పా తాము ఎన్నికలకు భయపడడం లేదని పేర్కొన్నారు.
గ్రామాల్లో రాజుకున్న ఎన్నికల రాజకీయం ... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పంచాయితీ పోరుకు పార్టీలు సిద్ధం

చంద్రబాబు నాయుడుకి తొత్తుగా నిమ్మగడ్డ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు కోసమే ఎన్నికలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వద్దని వారిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినిపించుకోకుండా మొండిగా వ్యవహరించారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పెడితే నిమ్మగడ్డ నే బాధ్యత వహించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.

ఇప్పటికీ ఎన్నికల నిర్వహణపై గుర్రుగానే ఉన్న వైసీపీ నేతలు
మొన్నటి వరకూ ఎన్నికలను నిర్వహించేది లేదని తేల్చి చెప్పిన వైసీపీ నేతలు, మంత్రులు, సర్కార్ తాజాగా సుప్రీం నిర్ణయంతో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘానికి సహకరిస్తామని ప్రకటించినా, ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై మాత్రం గుర్రుగానే ఉన్నారు. గత సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుబట్టిన సమయంలో, కరోనా కారణంగా నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటినుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ , సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, చివరకు న్యాయవ్యవస్థలు జోక్యం చేసుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై యుద్ధం చేశారు.

ఈ ఎన్నికలు చంద్రబాబుకు లబ్ది చేయటం కోసమేనని నిప్పులు
ఇక తాజాగా ఎన్నికలు నిర్వహించడానికి సరే అన్నప్పటికీ, ఎన్నికల నిర్వహణలో ఏం జరిగినా బాధ్యత నిమ్మగడ్డ రమేష్ దే అని తేల్చి చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇక విజయసాయి రెడ్డి చంద్రబాబుకు, నిమ్మగడ్డకు లింక్ చేస్తూ తీవ్ర పదజాలంతో మండిపడుతూనే ఉన్నారు. కేవలం ఈ ఎన్నికలు చంద్రబాబుకు లబ్ది చేయటం కోసమేనని నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు. ఇక పంచాయతీ వార్ మొదలైన నేపధ్యంలో ముందు ముందు నిమ్మగడ్డపై వైసీపీ నేతలు మరెంత మాటలదాడిని చేస్తారో!