సాయిరెడ్డి మళ్లీ వేశాడు.. మూర్ఖపు రాజు అని, 151లో కొడుకు కూడా ఓటమి, 13 జిల్లాలకు చేసిందిదీ, బాబు
ఏపీలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలను తామే డెవలప్ చేశామని చంద్రబాబు నాయుడు కామెంట్ చేయడంతో అగ్గిరాజేసింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ, ఓటమి గురించి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. అభివృద్దిని కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నాడని సాయిరెడ్డి ఫైరయ్యారు.

14 నెలల్లో ఏం చేశారు..
14 నెలల్లో ఏం చేశారని చంద్రబాబు అనడంతో సాయిరెడ్డి విరుచుకుపడ్డారు. బట్టలు విడిచిన మూర్ఖపు రాజు, తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించటం లేదనుకున్నాడట అని కామెంట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 చోట్ల పోటీచేసి 151 సీట్లలో ఓడిపోయిన విషయం మరచిపోయారా అని ధ్వజమెత్తారు. తన పేగుతెంచుకొని పుట్టిన కుమారుడిని కూడా గెలిపించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తానే 13 జిల్లాలను అభివృద్ది చేశానని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. డెవలప్‌పై కూడా గ్రాఫిక్స్ చూపిస్తూ.. తన మార్క్ మరోసారి నిరూపించుకున్నారు అని ఫైరయ్యారు. షేమ్.. షేమ్.. బాబూ.. అంటూ ట్వీట్ ముగించారు.
13 జిల్లాలకు చేసిందిదీ..?
అంతకుముందు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 13 జిల్లాలకు మేమేం చేశామో చెబుతున్నామని పేర్కొన్నారు. కానీ 14 నెలల్లో మీరేం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏది నిజమో గుర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజమైన అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అని ప్రభుత్వం చట్టాలు చేసినప్పటీ నుంచి వైసీపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తమ హయాంలో చేసిన అభివృద్ధి గురించి వివరిస్తానని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.

16 వేల కోట్ల లోటు బడ్జెట్..
2014లో రాష్ట్ర విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నామని గుర్తుచేశారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేదన్న చంద్రబాబు.. చెప్పుకోదగ్గ నగరం లేదని, పరిశ్రమలు కూడా లేవని తెలిపారు. సైబరాబాద్ తరహాలో నాలెడ్జ్ ఎకానమీ మోడల్‌ను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచించామని వెల్లడించారు. పోర్టు ఆధారిత పరిశ్రమలను ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను అభివృద్ధి చేశామన్నారు. తర్వాత రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టులకు నాంది పలికామన్నారు.

గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు..
రాష్ట్రానికి ఉన్న పెద్ద వనరు గోదావరి నది అని, ఇందుల్లోకి మిగులు జలాలు సముద్రంలోకి వెళుతున్నాయని పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించామని తెలిపారు. రాయలసీమ సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో చారిత్రాత్మక రీతిలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని వివరించారు. 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేశామని, సముద్రంలోకి వృథాగా పోయే నీటిని రాయలసీమ, ఉత్తరాంధ్రకు తరలించామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.64 వేల కోట్ల మేర ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు.

16 లక్షల కోట్ల మేర పెట్టుబడులుకు ఎంవోయూ..
పరిశ్రమలు వస్తే తప్ప పిల్లలకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో పెట్టుబడులకు శ్రీకారం చుట్టామని వివరించారు. సీఐఐ-ఏపీ భాగస్వామ్యంతో విశాఖలో సదస్సులు నిర్వహించామని వెల్లడించారు. ఐదేళ్లలో సుమారు రూ.16 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నామని చెప్పారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చామని, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ అక్కడే ఏర్పాటు చేశామని, ఎనర్జీ యూనివర్సిటీ కూడా అక్కడే ఏర్పాటు కానుందని తెలిపారు. హంద్రీ-నీవాకు ప్రాధాన్యతనిచ్చామని చంద్రబాబు తెలిపారు. రహదారులు, విద్యుత్ సహా అనేక రంగాల్లో సమస్యలు అధిగమించామని, సమగ్రాభివృద్ధికి నాంది పలికినట్టు చెప్పారు. 14 నెలల్లో ఏం చేశారో వివరించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. మూర్ఖపు రాజు అంటూ మండిపడ్డారు.