year ender 2021: ఏపీని కుదిపేసిన డ్రగ్స్ రచ్చ.. టీడీపీ వర్సెస్ వైసీపీ; ఆంధ్రప్రదేశ్ పై దేశవ్యాప్త చర్చ
2021వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను డ్రగ్స్ వ్యవహారాలు కుదిపేశాయి. జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలకు డ్రగ్స్ ఒక ఆయుధంగా మారింది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడడం, వాటి డెలివరీ అడ్రస్ విజయవాడ అని ఉండడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ దుమారం రేగింది. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మరీ ముఖ్యంగా టిడిపి నేతలు ఏపీ కేంద్రంగా డ్రగ్స్ దందా సాగుతోందని పెద్దఎత్తున విరుచుకుపడ్డారు.

ముంద్రా పోర్టులో పట్టుబడ్డ భారీ హెరాయిన్..ఏపీకి లింక్; జగన్ సర్కార్ టార్గెట్
ఆఫ్ఘనిస్తాన్ నుండి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు అక్రమ రవాణా జరుగుతూ పట్టుబడిన హెరాయిన్ రవాణా షిప్మెంట్ పై విజయవాడ అడ్రస్ ఉండటంతో మొదలైన రాజకీయ రచ్చ చిలికి చిలికి గాలివానగా మారి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ ప్రభుత్వానికి హెరాయిన్ లింకులు ఉన్నట్టుగా టిడిపి నేతలు విమర్శలు చేస్తూ, పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ వెనుక బిగ్ బాస్ ఎవరు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాలిబన్ల డ్రగ్స్ కు తాడేపల్లి ప్యాలెస్ కు లింక్ ఏంటి అంటూ టీడీపీ నేతలు మొదలుపెట్టిన రాజకీయ రచ్చ అధికారి వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

ఏపీలో యువత భవితపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు
ఏపి డ్రగ్స్ వ్యవహారంపై అటు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ సైతం జగన్ ను టార్గెట్ చేశారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, యువత డ్రగ్స్ మత్తులో పడి భవిష్యత్తును కోల్పోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో దొరికిన డ్రగ్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన సంబంధం లేదని, అటు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, వైసీపీ మంత్రులు, నేతలు వివరణ ఇచ్చారు. కావాలని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం గా పేర్కొన్నారు.

ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో ఏపీలోనూ సోదాలు .. అయినా ఏపీకి సంబంధం లేదన్న పోలీసులు, వైసీపీ నేతలు
అయితే గుజరాత్‌లోని ముంద్రాలో బయటపడ్డ డ్రగ్స్ రాకెట్‌కు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలు లేవని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చిచెప్పినప్పటికీ, ముంద్రా పోర్ట్, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నైలలో ఏకకాలంలో దాడులు చేసిన కేంద్ర ఏజెన్సీలు ఆరా తీశాయి. విజయవాడకు చెందిన ఆషి ట్రేడింగ్ కంపెనీ కార్యకలాపాల పైన కూడా దర్యాప్తు నిర్వహించారు. కస్టమ్స్ మరియు ఎక్సైజ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు ఇతర ఏజెన్సీలు డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్‌పై దర్యాప్తు చేస్తున్నాయి. సెప్టెంబర్ 15న ముంద్రా పోర్ట్‌లో రెండు కంటైనర్లలో సెమీ ప్రాసెస్డ్ టాల్క్ స్టోన్స్ సాకుతో అక్రమంగా తరలిస్తున్న 2,998.22 కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సోదాలు చేసిన అధికారులు దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేశారు.

డ్రగ్స్ దందా వెనుక తాడేపల్లి బిగ్ బాస్ .. కింగ్ పిన్ అంటూ జగన్ పై తీవ్ర ఆరోపణలు
డ్రగ్స్ కేసులో పట్టుబడిన సుధాకర్, ఆయన భార్య వైశాలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారిని వారి వెనుక వైసీపీ నేతలు ఉన్నారని, డ్రగ్స్ కింగ్ పిన్, తాడేపల్లి బిగ్ బాస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా అవేవీ పట్టించుకోకుండా ఏపీ డీజీపీ జగన్ భక్తిలో మునిగిపోయాడు అని విమర్శించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కూడా టార్గెట్ చేశారు. ఏపీ డ్రగ్స్ డాన్ ఎవరో అందరికీ తెలుసని, ముఖ్యంగా పోలీసుల అండదండలతోనే కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

టీడీపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన డీజీపీ
ఇక తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలపై పదే పదే సమాధానం చెప్పినప్పటికీ విమర్శలు చేస్తూ పోతున్న క్రమంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలుగుదేశం పార్టీ నేతలతో పాటుగా పలు పత్రికల యాజమాన్యాలకు లీగల్ నోటీసులు పంపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు డ్రగ్స్ వ్యవహారంపై పదే పదే విమర్శలు చేస్తున్న పలువురు టిడిపి నేతలకు, డ్రగ్స్ పై తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్న పలు మీడియా సంస్థలకుడిజిపి గౌతమ్ సవాంగ్ నోటీసులు జారీ చేశారు. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్గుజరాత్ లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ కు,ఆంధ్రప్రదేశ్ అడ్రస్మాత్రమే వాడుకున్నారని,దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన సంబంధం లేకున్నాతెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారనిపోలీసులతో పాటుగా,ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

చిత్తు కాగితాలతో సమానం అన్న టీడీపీ నేతలు .. వైసీపీ సర్కార్ పై ఎటాక్
టిడిపి నేతలకు ఏపీ డీజీపీ పంపించిన లీగల్ నోటీసులను టిడిపి నేతలు చిత్తు కాగితాలతో సమానం అన్నారు. ఏపీ డ్రగ్స్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నా రాష్ట్ర పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, ఏపీకి డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పటం దారుణమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్ర ప్రదేశ్ గా మారుతోందని, ఇప్పుడు దేశం మొత్తం ఏపీ డ్రగ్స్ వైపు చూస్తోందని నిప్పులు చెరిగారు. ఇక ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలను ఎదుర్కోవడం వైసీపీకి పెద్ద సవాల్ గా మారింది. ఇక వైసీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ వారి హయాంలోనే డ్రగ్స్ దందా జరిగిందని ఎదురు దాడికి దిగారు.

ఎదురు దాడి చేసిన వైసీపీ మంత్రులు, నేతలు, డ్రగ్స్ పై రాజకీయ రగడ
జగన్ పాలన చూసి ఓర్చుకోలేక చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ లు ఖాళీగా ఉండి డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ దందా మొదలుపెట్టారు అంటూ విమర్శలు గుప్పించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ ప్రకంపనలు రాజకీయ రచ్చ కారణమయ్యాయి. డ్రగ్స్ వ్యవహారం నుండి ఏపీ గంజాయిపై ఆ తర్వాత ఫోకస్ మొదలైంది. ఇక ఈ పరిణామాలు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టాయి. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారాయి.