వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదాపై 28రాష్ట్ర బంద్‌కు పిలుపు: ఢిల్లీలో జగన్ అరెస్ట్, లాఠీఛార్జ్.. గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిస్తున్నట్లు వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్షా ముగింపు సందర్భంగా చెప్పారు.

జగన్ మాట్లాడుతూ... మనకు ఢిల్లీ దాదాపు పదిహేడు వందల కిలోమీటర్ల దూరమని, ఇంత దూరం కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించేందుకు రైళ్లలో ఇంతమంది వచ్చిన వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. హోదా పైన ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు వచ్చామన్నారు.

రాష్ట్రాన్ని విభజించిన రోజు.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక హోదా పైన హామీలు ఇచ్చాయన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని మొత్తుకొని చెప్పినప్పటికీ వినలేదన్నారు. విభజన నాటి ఘటనకు సీతారాం ఏచూరి కూడా సాక్షి అన్నారు.

విభజన బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో... విభజన వద్దని చెప్పినందుకు తమను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. టీవీని ఆపి మరీ బిల్లు పెట్టిన ఆ రోజు బ్లాక్ డే అన్నారు. నాడు కేంద్రానికి చంద్రబాబు కూడా మద్దతు పలికారన్నారు.

విభజన వల్ల ఏపీకి కష్టాలు వస్తాయి కాబట్టే ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారన్నారు. ఐదేళ్లు ఇస్తామని కాంగ్రెస్ చెబితే, పదేళ్లు కావాలని బిజెపి నిలదీసిందన్నారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు కూడా ఓటు వేశారన్నారు.

ఆ రోజు సాక్షాత్తు అధికార పార్టీ, ప్రతిపక్షం ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టాయన్నారు. అయితే, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, కానీ దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మా సమస్యలు పట్టించుకోకుంటే అసలు రాజ్యాంగం ఉందా లేదా అని ప్రశ్నించవలసి వస్తోందన్నారు.

YS Jagan calls for Bandh on August 28th

నాడు 60 శాతం ప్రజలు విభజన వద్దని చెప్పినా విన్లేదన్నారు. ప్రత్యేక హోదా వల్ల మేలు జరుగుతుందన్నారు. హోదా వల్ల కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం ఉచితమని, వాటిని తిరిగి కేంద్రానికి కట్టాల్సిన అవసరం లేదన్నారు. హోదా వల్ల రెండో లాభం... పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం అన్నారు.

ప్రత్యేక హోదా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, అలాంటి దానిని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర విభజన జరిగి 15 నెలలు అయిందని... అప్పటి నుంచి ఒక్కసారి ఏపీకి రాని, పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడగని రాహుల్ గాంధీ ఇటీవల ఏపీకి రావడం విడ్డూరమన్నారు.

ఇక, బిజెపి ప్రత్యేక హోదా పదేళ్లు డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం హోదాను ఇవ్వడం లేదన్నారు. ఒడిశా, బీహార్ అడుగుతున్నాయని, 14వ ఫైనాన్స్ కమిషన్ వద్దని చెబుతున్నాయని కారణాలు చెబుతున్నారన్నారు. నాడు హామీ ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలియవా అన్నారు.

అసలు 14 ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందో బిజెపి, టిడిపిలకు తెలుసా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు 14 ఫైనాన్స్ కమిషన్‌కు ఏం సంబంధమన్నారు. ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బును.. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది 14 ఫైనాన్స్ కమిషన్ చూస్తుందన్నారు.

కానీ, కేటాయింపులు చేసే అధికారం ఆ కమిషన్‌కు లేదని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం నేషనల్ డెమక్రటిక్ కౌన్సిల్‌కు (ఎన్డీసీ) మాత్రమే ఉంటుందని, అలాంటప్పుడు 14 ఫైనాన్స్ కమిషన్ పేరు చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు.

YS Jagan calls for Bandh on August 28th

ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు ఇప్పుడు కారణాలు వెతుక్కుంటున్నారన్నారు. ఏపీకి హోదా ఇస్తే మీకు వచ్చే నష్టం ఏమిటని నేను.. కేంద్రాన్ని, చంద్రబాబును, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నానని చెప్పారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వరని తెలిసినప్పుడు చంద్రబాబు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాము ఆందోళనలు చేశామన్నారు. ఓ వ్యక్తి నిన్న తిరుపతిలో మృతి చెందాడని గుర్తు చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కుపోయారని, అందుకే ప్రత్యేక హోదా కోసం డిమాండు చేయడం లేదని చెబుతున్నారన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం, కేసు నుంచి బయటపడేందుకు ఏపీ రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు లంచాల కొరకు, డబ్బుల కొరకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం నత్త నడకన సాగుతోందని, పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారన్నారు. చివరకు ఇసుకను కూడా మాఫియాగా చేశారన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని పదే పదే చెబుతున్నారని, ఈశాన్య రాష్ట్రాలకు ఆ హోదా లేదా అని మన పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించగా.... కేంద్రమంత్రి స్పందిస్తూ... ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందని చెప్పారని తెలిపారు. వాటికి ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకివ్వరని జగన్ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా కోసం ఇంతటితో ఆగదని, చంద్రబాబు పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీలో చంద్రబాబును కడిగేస్తామన్నారు.

సిపిఎం సీతారాం ఏచూరీ మద్దతు

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండుకు తాము పూర్తి మద్దతిస్తున్నామని చెప్పారు. విభజనను తాము అప్పుడే వ్యతిరేకించామని, అయినప్పటికీ విభజన జరిగిందన్నారు.

అయితే, ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మనమందరం కలిసి పోరాడుదామని ఆయన చెప్పారు. పార్లమెంటులో, రోడ్ల పైన అందరం కలిసి పోరాడుదామన్నారు.

వైసిపి మార్చ్‌లో లాఠీఛార్జ్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష అనంతరం వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్లమెంటుకు మార్చ్ నిర్వహించారు. వీరి మార్చ్‌ను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు.

పోలీసులు, వైసిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఓ దశలో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో వైసిపి కడప జిల్లా నేత ప్రసాద్ రెడ్డి తలకు గాయమైంది. ప్రసాద్ రెడ్డి రైతు విభాగం నాయకుడు. కాగా, జగన్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
YSR COngress Party chief YS Jaganmohan Reddy called for bandh on August 28 for special status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X