హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ కోట బద్దలు కొడ్దాం, శాసిద్దాం: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టారు. వీరు మనుషులేనా ఆయన అడిగారు. కళ్లుండీ చూడలేని కబోదులని వారిని ఆయన అభివర్ణించారు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వదిలితే తప్ప సమైక్యంగా ఉన్నప్పుడే నీళ్లు రావడం లేదని, మధ్యలో మరో రాష్ట్రం వస్తే నాగార్జునసాగర్‌కు, శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయని ఆయన అడిగారు.

రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే మహారాష్ట్ర, కర్ణాటకలతో మన జీవితాలతో చెలగాటం ఆడడానికి వెనకాడడం లేదని ఆయన అన్నారు. అన్నదమ్ముల చిచ్చు పెట్టి, కర్ణాటక, మహారాష్ట్ర అన్యాయం చేస్తుంటే కనపించడం లేదా అని అడిగారు. మిగులు జలాల్లో వాటా కావాలని అడుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అడిగారు. కృష్ణా ఆయకట్టులో రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా అని ఆయన ఆ ముగ్గురు నేతలను అడిగారు. పోలవరం ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

YS Jagan

వీళ్లు నాయకులేనా..

రాజకీయాల్లో నీతి లేకుండా ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని ఒకరు పోటీ పడుతుంటే, మాట్లాడితే ఓట్లు సీట్లు పోతాయని మభ్య పెట్టే ప్రయత్నం మరొకరు ప్రయత్నిస్తున్నారని ఆయన సోనియా, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు. వీళ్లా మన నాయకులు అని అనిపిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి సోనియా గాంధీ ఉర్రూతలూగుతున్నారని, ప్యాకేజీల కోసం దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని, సోనియా గీసిన గీత దాటకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తూ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమం చేస్తున్నారని, అలా ఉద్యమం చేస్తుంటే ఆ ముగ్గురు నాయకులకు కనిపించడం లేదా అని ఆయన అన్నారు. గత 80 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే వారికి కనిపించడం లేదా అని ఆయన అడిగారు. దాని గురించి వారు ఆలోచించడం లేదని, తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కాలేజీలకు యాజమాన్యాలు వచ్చి ఉద్యోగులు ఇచ్చేవని ఆయన అన్నారు. అప్పుడు ఏడాదికి 57 వేల ఉద్యోగాలు ఇచ్చేవని, ఇప్పుడు 27 వేలు కూడా దాటడం లేదని, దాన్నిబట్టి హైదరాబాదును నాశనం చేస్తున్నారని అర్థమవుతోందని ఆయన అన్నారు. హైదరాబాదు లేకుపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, అభివృద్ధి పథకాలు కుంటుపడుతాయని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే చిన్న వ్యాపారుల ఆస్తుల విలువలు పడిపోతాయని ఆయన అన్నారు. అవి పడిపోతే సోనియా ఇస్తారా, చంద్రబాబు ఇస్తారా అని ఆయన అడిగారు. దేశంలో రెండవ అతి పెద్ద జాతి తెలుగుజాతి అని, 28 రాష్ట్రాలున్న మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని, విభజిస్తే 17 స్థానాల కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు 12 ఉన్నాయని అన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా నాశనమైపోతోందని, ఓట్ల కోసం సీట్ల కోసం రాజకీయం చేయడం అందుకు కారణమని ఆయన అన్నారు.

ఉద్యోగులను కిరణ్ భయపెట్టారు..

చంద్రబాబు నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు, అది అయిపోయే సమయానికి ఉద్యోగులందరినీ పిలిచి ఒక్కొక్కరినీ పిలిచి భయపెట్టి సమ్మెను విరమింపజేశారని, పట్టపగలే నీతిలేని రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. విభజన చేస్తున్నామని సిడబ్ల్యుసి చెప్పినప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని అడిగారు. అంతా అయిపోయాక రాజీనామా చేసి ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఆమోదం లేకుండా పట్టపగలు ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎక్కడా లేనట్లుగా మన రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు. శానససభను సమావేశపరిచి, సమైక్య తీర్మానం చేసి పంపుదామని కిరణ్ కుమార్ రెడ్డిని అడిగామని, అలా చేసి ఉంటే దేశమంతా అలజడి చెలరేగుతుందని, సోనియా గాంధీ వెనక్కి పోతారని చెప్పామని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు.

తిరిగి వెళ్లాలని బిల్లు చేస్తే ఎలా ఉంటుంది...

చేసిన ప్రయత్నమంతా అరణ్య రోదనగానే మిగిలిందని, చంద్రబాబు, కిరణ్‌లు రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన అన్నారు. సోనియా గాంధీని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రధాని సీట్లో కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చారని, ఓట్ల కోసం సీట్ల కోసం తన కుమారుడిని ప్రధానిని చేయడానికి రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతోందని ఆయన అన్నారు. మీ కుమారుడిని ప్రధాని సీట్లో కూర్చోబెట్టడానికి మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఏ విధంగా సమంజసమని ఆయన అడిగారు. భారతీయ పౌరసత్వం తీసుకున్న 30 ఏళ్లలో మాలో ఒక్కరయ్యారని, భారత పౌరసత్వం తీసుకున్న వారంతా వెనక్కి వెళ్లిపోవాలని బిల్లు తెస్తే సోనియాకు నచ్చుతుందా అని అడిగారు. కాంగ్రెసు వాళ్లు కల్లు తాగిన కోతుల్లో రెచ్చిపోతారని ఆయన అన్నారు. 30 ఏళ్లకే మీకంతగా వ్యామోహం ఉంటే, 60 ఏళ్లుగా కలిసి ఉన్నామని, మాకు ఎంత బాధ ఉండాలని ఆయన అడిగారు.

ఇందిరా ఏమన్నారో చూడండి

మీకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అని ఆయన సోనియాను అడిగారు. విశాలాంధ్ర కావాలని తెలంగాణ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని, రాష్ట్ర చరిత్ర సోనియాకు తెలుసా అని అడుగుతున్నానని ఆయన అన్నారు. విశాలాంధ్ర కావాలని 103 మంది శానససభలో ఓటేసి సమైక్యాంధ్రను తెచ్చుకున్నారని ఆయన అన్నారు. విశాలాంధ్ర పోరాటం చేసిన రావి నారాయణ రెడ్డి గురించి తెలుసా, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జయసూర్య గురించి తెలుసా అని ఆయన అడిగారు. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదని రావి నారాయణ రెడ్డి అన్నారని ఆయన గుర్తు చేశారు. చీలికవాదం తెలంగాణకు హానికరమని రావి నారాయణ రెడ్డి అన్నారని ఆయన అన్నారు.

ఇందిరా గాంధీ 1972 డిసెంబర్ 21వ తేదీన ప్రధానిగా ఉంటూ పార్లమెంటులో ఇచ్చిన ప్రసంగాన్ని చదవాలని ఆయన సోనియా గాంధీకి సూచించారు. 1955 సంవత్సరం ఇంకా గుర్తుందని, తాను దక్షిణ భారతదేశం తిరుగుతున్నానని, విశాలాంధ్ర కావాలని తెలుగువాళ్లు ఘోష పెట్టిన మాటలు తన చెవుల్లో మారుమోగుతున్నాయని ఇందిరా గాంధీ అన్నారని ఆయన అన్నారు. ఎందుకు తమ జీవితాలతో చెలగాటమాడుతారని జగన్ సోనియాను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బలహీనంగా మార్చాలని చూడడం న్యాయమేనా అన్నారు.

ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి...

ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు. సోనియా గాంధీ గుండెలు అదరాలని ఆయన అన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి గూబలు అదరాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను అంగీకరించబోమని గట్టిగా చెప్పాలని ఆయన అడిగారు. తెలుగువాళ్లు ముక్కలు కావాలా, మన హైదరాబాదు కోసం మనమే తన్నుకోవాలా అని అడుగుతున్నా అని ఆయన అన్నారు. తెలుగుజాతిని ద్రోహం చేస్తున్న సోనియాను, కిరణ్‌ను, చంద్రబాబును క్షమించాలా అని ఆయన అడిగారు.

పార్లమెంటు శీతాకాలం సమావేశాల దాకా పోరాడుదామని, వచ్చే ఎన్నికల్లో 30 సీట్లను సాధించుకుందామని, ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూడాలని అడుగుదామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధాని సీట్లో కూర్చోబెడుదామని ఆయన అన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడుదామని, ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దామని ఆయన అన్నారు. జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్ర ప్రదేశ్, జై వైయస్సార్ అంటూ ఆయన నినాదాలు చేసి ప్రసంగాన్ని ముగించారు. దాదాపు గంటసేపు ఆయన ప్రసంగం సాగింది.

English summary
YSR Congress president YS Jagan lashed out at Congress president Sonia Gandhi, CM Kiran kumar Reddy and Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X