కాపుల విషయంలో రూటు మార్చిన జగన్
Mudragada Padmanabham: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి టార్గెట్ అయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి తరహాలోనే ఇప్పుడు కూడా ఆయన ఇంటిపై దాడి ఘటన చోటు చేసుకుంది.
కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో గల ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఆదివారం తెల్లవారు జామున జనసేన కార్యకర్త హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ట్రాక్టర్‌తో దాడికి దిగాడు. కిర్లంపూడి ఇంటి గేటు విరగ్గొట్టుకుని మరీ లోపలికి ప్రవేశించాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ప్రహరీగోడను దాటుకుని ఇంట్లోకి వచ్చాడు.

ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన కారును ట్రాక్టర్‌తో ఢీ కొట్టాడు. దీనితో కారు వెనుక భాగం దెబ్బతిన్నది. ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ పద్మనాభం ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఇంట్లో ఉన్న అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ దాడి ఘటన ఉద్దేశపూరకంగా చోటు చేసుకుందని, రాజకీయ కారణాలతోనే కాపు నేతపై దాడి చేయించారంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతీసారీ ముద్రగడ పద్మనాభం, ఆయన ఇంటిపై దాడి జరగడం సర్వసాధారణమైపోయిందంటూ మండిపడ్డారు.
ఈ ఘటన తరువాత ఉమ్మడి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కిర్లంపూడికి వెళ్లారు. ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఇది జనసేన పనేనని, దాడి చేసిన వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.
తాజాగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముద్రగడ పద్మానాభాన్ని ఫోన్‌లో పరామర్శించారు. 20 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముద్రగడ- ఈ దాడి ఎలా చేసుకుందనే విషయాన్ని జగన్‌కు వివరించారు. దాడి చేసిన వ్యక్తిని జనసేన కార్యకర్తేనని తెలిపినట్లు సమాచారం.
ఈ సందర్భంగా జగన్.. ఆయనకు భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఉంటారని జగన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications