ఇంటికే రేషన్, మాట నెరవేర్చుకున్న జగన్ : రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభం
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన కొత్త వాహనాలను ఈ రోజు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్ రెడ్డి : జనసేన కార్యకర్త వెంగయ్య మృతిపై లోకేష్ వ్యాఖ్యలు

రేషన్ సరుకులు చేరవేసే వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
నవరత్నాలలోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సీఎం జగన్ సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేస్తున్నారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో చేయని వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తుపెట్టుకుని ఇంటి వద్దకే వారికి రేషన్ సరుకులు అందిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు రేషన్ సరుకులను చేరవేసే వాహనాలను ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9260 వాహనాల ప్రారంభం
ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాలోని రేషన్ వాహనాలను ఆయా జిల్లాలలో మంత్రులు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9260 వాహనాలను నేడు ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రజలకు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని, సరుకులను డోర్ డెలివరీ చేయడం కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి .అంతేకాకుండా రేషన్ సరుకులు సకాలంలో ఇళ్లకు చేరుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం అన్ని మొబైల్ వాహనాలకు జీపీఎస్ అమర్చారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బస్తా కు సీల్, ప్రతి సంచికీ యూనికోడ్ ఉండడంవల్ల ఆన్లైన్ ట్రాకింగ్ చేసి రేషన్ అక్రమాలను అరికట్టడానికి ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 1 నుండి ఇంటికే రేషన్ .. ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన విధానం
కార్డుదారులు మొబైల్ యాప్ ద్వారా పంపిణీ వివరాలను రియల్ టైంలో కూడా తెలుసుకోవచ్చు. ఈ వాహనాలు నెలలో సగటున 18 రోజులు లబ్ధిదారులకు రేషను అందించాలి . ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన విధానానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా నిర్ణయంతో లబ్ధిదారులకు అందరికీ నాణ్యమైన రేషన్ సకాలంలో చేరుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది.

సంవత్సరానికి 830 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి పథకానికి శ్రీకారం
సంవత్సరానికి 830 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి ఈ పథకాన్ని రూపొందించిన జగన్ ప్రజల వద్దకే పాలన , ప్రతీ నిరుపేద గడపకూ రేషన్ సరుకులు అందించటం కోసం అందించటం కోసం , ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇచ్చే ఈ విధానం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.