దావోస్ లో జగన్ పెట్టుబడుల వేట-టెక్ మహీంద్రా, దస్సాల్ట్ ప్రతినిధులతో భేటీ-టార్గెట్ వైజాగ్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రానికి కొత్గా పరిశ్రమలు రాలేదని, పెట్టుబడులు రాలేదని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన సీఎం జగన్.. పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు భారీ పారిశ్రామిక వేత్తలతో జగన్ ఇవాళ భేటీ అయ్యారు.

జగన్ పెట్టుబడుల వేట
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ వెళ్లారు. ఇందులో భాగంగా ఇవాళ పబ్లిక్ సెషన్ లో పాల్గొన్న సీఎం జగన్.. రాష్ట్రానికి ఉన్న అనుకూలలను వారితో ఏకరువుపెడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల రంగంలో ఏపీ మేటిగా ఉందని వారికి గుర్తుచేశారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో జగన్ భేటీ అయ్యారు. వీరిలో టెక్ మహీంద్రాతో పాటు డస్టాల్ట్ ప్రతినిధులు ఉన్నారు.

వైజాగ్ కి వచ్చేందుకు టెక్ మహీంద్రా రెడీ
ఇవాళ ఏపీ పెవిలియన్‌లో టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానితో సీఎం జగన్ భేటీ అయ్యారు. జగన్ తో భేటీ అనంతరం గుర్నానీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగారితో మంచి సమావేశం జరిగిందన్నారు. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని ఆయన తెలిపారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని జగన్ కోరినట్లు వెల్లడించారు.
ఆర్టిఫియల్ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని సంకల్పంతో ఉన్నారన్నారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారని గుర్నానీ వెల్లడించారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఆంధ్రా వర్శిటీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు టెక్ మహీంద్రా ఎండీ గుర్నానీ ప్రకటించారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు.

దస్సాల్ట్ హామీ ఇదే
అనంతరం దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెశిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలోనూ పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రితో చక్కటి సమావేశః జరిగిందని దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెశిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై మా సమావేశంలో చర్చ జరిగిందన్నారు. కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు. చర్చలు ఫలప్రదంగా సాగాయని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నామన్నారు. ఏపీతో భాగస్వామ్యానికి దస్సాల్ట్ సిస్టం ఉత్సాహంగా ఉందన్నారు