ఏపీలో అమూల్ ప్రాజెక్టు ప్రారంభం- రూ.6551 కోట్లతో- చిత్తూరు, కడప, ప్రకాశంలో తొలిదశ
ఏపీలో పాల ఉత్పత్తి రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఉద్దేశించిన అమూల్ ప్రాజెక్టును సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో సీఎం జగన్ అమూల్ సంస్ధ ప్రతినిధులతో కలిసి ప్రాజెక్టును ప్రారఁభించారు. రాష్ట్రంలో ప్రాజెక్టు తొలిదశలో భాగంగా మూడు జిల్లాల పరిధిలో ఇది అమల్లోకి రానుంది. స్ధానిక డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అమూల్ సంస్ధతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో రైతులకు ఈ ఒప్పందం వల్ల భారీగా మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైతులతో పాటు మహిళలకూ మేలు చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

అమూల్ ప్రాజెక్టు ప్రారంభం...
ఏపీలో డెయిరీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్ధతో గతంలో కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రూ.6551 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని ప్రభుత్వ డెయిరీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన అమూల్ ప్రాజెక్టును ఇవాళ సీఎం జగన్ సచివాలయంలో ప్రారంబించారు. తొలిదశలో భాగంగా కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ సేవలు ప్రారంభమవుతాయి. స్ధానికంగా ప్రభుత్వం, అమూల్ సంయుక్తంగా పాల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం పనిచేయబోతున్నాయి. అమూల్ ప్రాజెక్టు రాకతో రాష్ట్రంలోని లక్షల మంది డెయిరీ రైతులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం జగన్ తెలిపారు.

పాడిరైతులకు మేలు, మహిళలకు బోనస్
సచివాలయంలోని మొదటి బ్లాక్ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ-అముల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్... అనంతరం
ఏపీ అమూల్- వెబ్ సైట్ , డాష్ బోర్డును కూడా ప్రారంభించారు.
అమూల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9899 పాల సేకరణ కేంద్రాలు
ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు
అందుబాటులోకి వస్తున్నట్లు జగన్ తెలిపారు. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలో పాల సేకరణ
ఒప్పందం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.
పాడి రైతులకు ఎక్కువ ధర వస్తుందని, లీటర్ కు 5 నుంచి 7 రూపాయల మేర అధిక ఆదాయం వస్తుందని జగన్ తెలిపారు.
మార్కెట్ లో పోటి తత్వం వస్తేనే అందరికీ మంచిదన్నారు.
అమూల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను తదుపరి బోనస్ గా రైతులకు చెల్లిస్తుందని జగన్ వెల్లడించారు. సహకార రంగంలో ఏర్పాటైన అముల్ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమూల్ రావటంతో ఏపీలో పాలసహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు.

ఏపీ రెండో అమూల్ అవుతుందన్న సంస్ధ ఎండీ
అమూల్ సంస్థలో 36 లక్షల మంది రైతులే యజమానులుగా ఉన్నారని,
గుజరాత్ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన 7 లక్షల మంది రైతులు కూడా అమూల్ లో భాగస్వాములయ్యారని సంస్ధ ఎండీ ఆర్.ఎస్ సోధి తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల కోట్ల టర్నోవర్ పాల వ్యాపారం నడుస్తోందని, నాలుగు కోట్ల లీటర్ల పాలు రోజూ ఏపీలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.
2.9 కోట్ల లీటర్ల వినియోగం తర్వాత మిగులు ఉత్పత్తిగా ఉందన్నారు. ఏపీలో వ్యవస్థీకృతంగా ప్రతీ రోజూ 69 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నట్లు సోధీ తెలిపారు. ఏపీలో తమ అంచనా కన్నా మంచి నాణ్యమైన పాలు ఉన్నాయన్నారు. అమూల్ రావటం ఎవరికీ పోటీ కాదని భావిస్తున్నామన్నారు. ఇది రైతుకు, వినియోగదారులకు నాణ్యత పెంచటమేనని అమూల్ ఎండీ తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా పాల సేకరణ చేయటం మంచి నిర్ణయమని భావిస్తున్నా
అన్నారు. త్వరితగతిన రైతులకు కూడా చెల్లింపులకు ఆస్కారం ఉంటుందన్నారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ రెండో అమూల్ గా మారుతుందని భావిస్తున్నట్లు
ఆర్.ఎస్ సోధి పేర్కొన్నారు.