బీజేపీ రథయాత్ర సవాల్- కౌంటర్ వ్యూహానికి పదును పెడుతున్న జగన్- అమిత్‌షా దృష్టికి ?
ఏపీలో ఆలయాల ఘటనల ద్వారా వచ్చిన మైలేజీని ఊరికే పోగొట్టుకోవడం ఇష్టం లేని బీజేపీ ఇప్పుడు రథయాత్ర ద్వారా మరో నిప్పు రగిల్చేందుకు సిద్దమవుతోంది. గతంలో బీజేపీ దిగ్గజం అద్వానీ చేపట్టిన రథయాత్ర ద్వారా ఆ పార్టీకి అయోధ్య ఉద్యమంలో భారీ మైలేజ్ దక్కింది. దీంతో ఇప్పుడు అదే తరహాలో ఏపీలోనూ తమ పార్టీకి జవసత్వాలు నింపేందుకు రథయాత్రను వాడుకోవాలని కాషాయ నేతలు సిద్దమవుతున్నారు. దీంతో రథయాత్రను ఎదుర్కొనేందుకు వైసీపీ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. తిరుపతి ఉపఎన్నికకు సమయం సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రథయాత్రను ఎదుర్కొనేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నారు.

అద్వానీ రథయాత్రతో మైలేజ్
గతంలో అయోధ్య ఉద్యమాన్ని రగిల్చేందుకు బీజేపీ దిగ్గజం లాల్‌కృష్ణ అద్వానీ 1992లో రథయాత్రను చేపట్టారు. ఈ రథయాత్ర ద్వారా అయోధ్య ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయగలిగారు. అప్పటివరకూ అయోధ్య గురించి తెలియని వారు కూడా రథయాత్ర తర్వాత బీజేపీకి చేరువయ్యారు. అంతిమంగా బాబ్రీ మసీదు కూల్చివేతకు జనాల్ని రెచ్చగొట్టేందుకు కూడా ఈ యాత్ర ఉపయోగపడిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా బీజేపీకి జవసత్వాలు నింపడంలో అప్పటి అద్వానీ రథయాత్ర చేసిన మేలు అంతా ఇంతా కాదు.

అద్వానీ బాటలోనే రథయాత్రకు సోము పిలుపు
ఇప్పుడు ఏపీలో బీజేపీకి ఫామ్‌లోకి రావడం తక్షణావసరం. అన్నింటికంటే మించి రాష్ట్రంలో ఆలయాల్లో విగ్రహాల విధ్వంసంతో రాజకీయ విమర్శల ద్వారా బీజేపీ తిరిగి జవసత్వాలు నింపుకుంటోంది. గత ఎన్నికల నాటికి ఏపీకి విభజన హామీలను నెరవేర్చలేదని కోపంతో జనం బీజేపీకి డిపాజిట్లు లేకుండా తరిమికొట్టారు. ఇప్పుడు ఆలయాల ఘటనలతో రాజకీయంగా దక్కిన మైలేజ్‌ను మరింతగా పెంచుకోవాలంటే తప్పనిసరిగా మరో భారీ కార్యక్రమం చేపట్టాలి. దీంతో అద్వానీ బాటలోనే రథయాత్రకు బీజేపీ నేత సోము వీర్రాజు స్కెచ్ గీసుకున్నారు. త్వరలో తిరుపతిలోని కపిల తీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకూ యాత్ర ఉంటుందని ప్రకటించారు.

జగన్‌కు సవాలుగా బీజేపీ రథయాత్ర
ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసంతో హిందువుల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్న జగన్‌కు బీజేపీ విసురుతున్న రథయాత్ర సవాల్ ఇబ్బందికరంగా మారింది. అనుకున్నట్లుగా బీజేపీ రథయాత్ర నిర్వహించినా, ప్రభుత్వం దాన్ని అడ్డుకుని నిలువరించినా అంతిమంగా ఆ పార్టీకి మైలేజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో యాత్రకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్న విషయం దగ్గరినుంచి, దీన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం వరకూ ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగని అనుమతిస్తే మాత్రం జగన్‌కు రాజకీయంగా భారీ నష్టం తప్పకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కౌంటర్ వ్యూహం సిద్ధం చేసే పనిలో బిజీగా కనిపిస్తోంది

అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం
ఏపీలో ఆలయాల విధ్వంసం ఘటనలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైత్యన్యం పేరుతో రాష్ట్ర బీజేపీ నేతలు చేపట్టిన రథయాత్ర వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగానే ఈ అంశాన్ని ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నేతల రథయాత్ర వల్ల శాంతిభద్రతలతో పాటు ఇతరత్రా ఇబ్బందులు ఉంటాయని, దానికి బదులు విగ్రహాల విధ్వంసాలపై మరే ఇతర చర్యలకైనా సిద్ధమనే అంశం షాకు చెప్పనున్నట్లు తెలుస్తోంది. తద్వారా యాత్ర విరమించుకునేలా రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పాలని షాను జగన్ కోరే అవకాశముంది.