ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ-నిధులు, జిల్లాలు, రాజధానులపై కీలక చర్చలు
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం సహా పలు కీలక అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పెద్దల పిలుపుతో ఇవాళ హస్తినలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాల్ని ఆయన చర్చిస్తున్నారు.
గతంలో జనవరి 3న ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్ ఏడు పాయింట్ల అజెండాను ఆయనకు అందించారు. ఇందులో పోలవరం, మూడు రాజధానులతో పాటు నిధులు వంటి అంశాలున్నాయి. అవే అంశాల్ని తిరిగి ప్రధాని మోడీ వద్ద జగన్ ఈసారి కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి అదనంగా కొత్తగా అమల్లోకి వచ్చిన జిల్లాలు, అలాగే త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణతో పాటు పలు అంశాల్ని ప్రధానికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీని భారీగా నిధులిచ్చిన ఆదుకోవాలని కోరుతున్నట్లు సమాచారం.

ఏపీ ఆర్ధిక పరిస్దితిపై కేంద్రంతో పాటు కాగ్ వంటి సంస్ధలు కూడా ఇప్పటికే చురకలు అంటిస్తున్నాయి. నానాటికీ దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికీ సమాధానం చెప్పుకోలేకపోతోంది. దీంతో గతంలో ఇచ్చిన హామీల మేరకు రెవెన్యూ లోటు భర్తీతో పాటు పోలవరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీని జగన్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే గతంలో జరిగిన పలు భేటీల్లోనూ సీఎం జగన్ కోరిన వారికి ముక్తసరిగా మాత్రమే ఆమోదముద్ర వేసిన ప్రధాని.. నిధుల కేటాయింపు సహా ఏపీకి ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదు. ఈసారి అసలే రాజ్యసభలో కూడా బీజేపీకి బలం పెరగడంతో వైసీపీపై ఆధారపడాల్సిన పరిస్ధితులు కూడా లేవు. ఈ నేపథ్యంలో ప్రధాని స్పందించి వరాలిస్తే మాత్రం గొప్పేనని చెప్తున్నారు.