జగన్ నయా ట్రెండ్-ఏ సమస్య అయినా అదే రూటు-నొప్పించక, తానొవ్వక- గతానికి భిన్నంగా
ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన సంక్షేమంతో పాటు ఏపీలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో సీఎం జగన్ సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న శైలిపైనా ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కీలక సమస్యల పరిష్కారంలో జగన్ చూపుతున్న చొరవ, ఆయా వర్గాల్ని అక్కున చేర్చుకుంటున్న తీరు ఆయన్ను అనతికాలంలోనే పరిణితి చెందిన రాజకీయ నేతగా నిలబెడుతున్నాయి.

సమస్యల వలయంలో జగన్
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన వైఎస్ జగన్ కు సమస్యలు స్వాగతం పలికాయి. అప్పటికే అఫ్పుల పాలైన రాష్ట్రం, విభజన కారణంగా అపరిష్కతంగా ఉండిపోయిన సమస్యలు, రాజధాని అభివృద్ధి కాకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చుట్టూ సమస్యలే. వీటన్నింటినీ అధిగమించి ఐదేళ్లలో మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలనేది జగన్ తాపత్రయం. ఇందుకోసం భారీ ఎత్తున అమలుచేస్తున్న నవరత్నాల్ని మాత్రమే నమ్ముకునే పరిస్ధితి లేదు. వీటికి మంచి ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరించారన్నది చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యంగా అప్పటికే రాష్ట్రంలో పాతుకుపోయిన ఓ వర్గం మీడియాను ఎదుర్కొంటూ ఈ సమస్యల్ని పరిష్కరించాలంటే రాజకీయాల్లో తలపండిన ఉద్దండులకే సాధ్యం కాదు. అలాంటి పరిస్ధితుల్లో జగన్ ఏం చేస్తున్నారనేది రాష్ట్రమే కాదు దేశం కూడా గమనిస్తోంది.

తనదైన శైలిలో పరిష్కారం
రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో ఎదురైన సమస్యలైనా, తాజాగా ప్రభుత్వం ఎదుర్కొన్న టాలీవుడ్ సినిమా టికెట్ల ధరల వ్యవహారమైనా, ఉద్యోగుల పీఆర్సీ సమస్య అయినా జగన్ మాత్రం వాటిని పరిష్కరించడంలో భిన్నమైన శైలిని ప్రదర్శిస్తున్నారు. కేవలం చర్చల కోసం చర్చలో, ఆయా వర్గాలు అడుగుతున్న డిమాండ్లను ఊరికే అంగీకరించడమో కాకుండా వాటిని హేతుబద్ధతతో పరిష్కరిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వం అంటే అందరికీ తలొగ్గే పాత రకం కాదనే అంశాన్ని ఆయా వర్గాలకు చెప్పకనే చెప్పడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు.

ఉద్యోగుల్ని పీఆర్సీపై మెప్పించారిలా
ఉద్యోగులకు గతంలో ప్రభుత్వం మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అంత మెరుగ్గా పీఆర్సీ ఇచ్చేందుకు ఖజానా నిండుకుంది. అలాగని ఉద్యోగుల్ని నిరాశపరిచే పరిస్ధితి లేదు. వారి సహకారంతోనే గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ వారిపై పోరు సలపడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో పీఆర్సీపై ఉద్యోగ నేతల్ని ఒప్పించడంలో ముందుగా జగన్ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వాస్తవ పరిస్ధితిని ఉద్యోగ నేతల ముందు పెట్టి ఏం చేద్దామంటూ వారినే అడిగారు. చివరికి వారిని కూడా మన ప్రభుత్వంలో మన నిర్ణయం ఎలా ఉండాలనే దానిపై డోలాయమానంలో పడేశారు. దీంతో ఉద్యోగ నేతలు దిగొచ్చారు. సగటు ఉద్యోగుల నుంచి కాస్త వ్యతిరేకత ఉన్నా అంతిమంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దృష్టా ఈ పీఆర్సీ తప్పదంటూ వారిని ఉద్యోగ నేతలు ఒప్పిస్తున్నారంటే అది జగన్ సక్సెస్ గానే చెప్పుకోవచ్చు.

టాలీవుడ్ ను దారికి తెచ్చారిలా
ఒకప్పుడు జగన్ అధికారంలోకి రాగానే అప్పటికే టీడీపీతో పాటు ఆ పార్టీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గంతోనూ బలమైన బంధం పెనవేసుకుపోయిన టాలీవుడ్ పెద్దలు వైసీపీ ప్రభుత్వంవైపు కన్నెత్తి చూడలేదు. మర్యాదపూర్వకంగా అయినా సీఎం జగన్ ను కలిసి అభినందించలేదు. చివరికి సినిమా టికెట్ల అనుమతుల కోసం, కరోనాలో షూటింగ్ ల అనుమతుల కోసం మాత్రం తాడేపల్లికి క్యూ కట్టారు. దీంతో పరిస్ధితిని గ్రహించిన జగన్.. అవే అంశాల్లో వారిని కట్టడి చేయడం మొదలుపెట్టారు. చివరికి జగన్ టాలీవుడ్ ను అణచివేస్తున్నారనే విమర్శలు వస్తున్నక్రమంలో మళ్లీ ఇండస్ట్రీ అనధికారిక పెద్దగా ఉన్న చిరంజీవిని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. చివరికి టాలీవుడ్ పెద్దలంతా వచ్చి తాజాగా జగన్ జోక్యంతోనే సమస్య పరిష్కారమైందంటూ అభినందించి వెళ్లారు.

జగన్ నయా ట్రెండ్
గతంలో పనిచేసిన ప్రభుత్వాల హయాంలో సమస్యలు ఎధురైనప్పుడు వాటిని పరిష్కరించడంలో ఎవరికి వారు భిన్నమైన శైలి అనుసరించే వారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా తనదైన శైలిలో సమస్యల్ని పరిష్కరిస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సమస్య తలెత్తగానే బెంబేలెత్తకుండా దాని పరిష్కారంపై అందుబాటులో ఉన్న పరిష్కారాల్ని అన్వేషించడం, చర్చల ద్వారా పరిష్కరించేందుకు వీలుగా సంప్రదింపులు జరపడం, వాస్తవ పరిస్ధితుల్ని, అందరి ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం, అంతిమంగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపించడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. అన్నింటికీ మించి అప్పటివరకూ గొంతెత్తిన వారు కూడా తప్పుంటే మన్నించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది.