రాజధానులపై జగన్ మౌనం-ఎన్నికల అజెండాలో లేనట్లే ? చంద్రబాబుకూ వరమవుతుందా ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన మూడు రాజధానుల ప్రక్రియ ఇప్పటికీ ఓ అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతోంది. ఈ మధ్యలో హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పుతో మొత్తం సీన్ మారిపోయింది. హైకోర్టు తీర్పుతో భారీ షాక్ తగిలినా అసెంబ్లీలో చర్చ పెట్టి అసహనం వెళ్ల గక్కిన జగన్.. ఇప్పుడు క్రమంగా మూడు రాజధానుల వ్యవహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇది అంతిమంగా చంద్రబాబుకు అడ్వాంటేజ్ గా మారబోతోందన్న చర్చ జరుగుతోంది.

జగన్ మూడు రాజధానులు
ఏపీలో రెండేళ్ల క్రితం మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైఎస్ జగన్ కు దానికి ఎలా ముగింపు పలకాలో ఇప్పుడు తెలియడం లేదు. ఓవైపు అమరావతి స్ధానంలో మూడు రాజధానులు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బగా మారింది. దీనిపై సుప్రింకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సాహసించడం లేదు. హైకోర్టు తీర్పుకు ముందే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుుడు వాటి స్ధానంలో కొత్త బిల్లు తెచ్చేందుకు కూడా సాహసించడం లేదు.

రాజధానులపై జగన్ మౌనం
మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీ సమావేశం పెట్టి తమ అసహనం వ్యక్తం చేసిన సీఎం జగన్, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా సీఎం జగన్ మూడు రాజధానులపై బహిరంగంగానే కాదు, అంతర్గత చర్చల్లో కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో ప్రభుత్వం తరఫున అధికార గణం కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ తమ వ్యాఖ్యల్లో, చర్చల్లో మూడు రాజధానుల మాటెత్తెందుకే జంకుతున్నారు. దీంతో రాజధానుల వ్యవహారం ఇక డస్ట్ బిన్ లోకి వెళ్లినట్లే కనిపిస్తోంది.

ఎన్నికల అజెండా నుంచీ మాయం ?
రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావిడి మొదలుపెట్టేసిన సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదనే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నిజం చేస్తూ రాజకీయానికి పదును పెడుతున్నారు. అయితే ఇందులో ఎక్కడా మూడు రాజధానుల గురించి కానీ, దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారనే అంశాన్ని గానీ ప్రస్తావించడం లేదు. దీంతో మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల అజెండాగా మార్చడం జగన్ కు ఇష్టం లేదనే అంశం స్పష్టమైపోతోంది.

చంద్రబాబుకూ అడ్వాంటేజ్ ?
హైకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీ సమావేశంలో అసహనం వ్యక్తం చేసిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా పక్కనబెట్టేయడం ఇప్పుడు విపక్ష నేత చంద్రబాబకు పూర్తిగా కలిసొస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై మౌనం వహిస్తుండటంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా దీన్ని కెలికేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓసారి రాజధాని చర్చ మొదలైతే మాత్రం అది అంతిమంగా జగన్ తో పాటు చంద్రబాబుకూ ఇబ్బందికరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. గతంలో అమరావతి రాజధాని పూర్తి చేయకుండా చంద్రబాబు అధికారం కోల్పోగా.. ఇటు వైఎస్ జగన్ కూడా సగం అమరావతిని కూడా పూర్తి చేయకుండా, మూడు రాజధానులు కట్టకుండా టైం పాస్ చేసేశారు. దీంతో ఇరువురు నేతల్నీ జనం ప్రశ్నించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్ మౌనాన్ని చంద్రబాబు కూడా పరోక్షంగా ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది.