ఎస్ఎల్బీసీ మీటింగ్-3.19 లక్షల కోట్ల రుణ ప్రణాళిక- విరివిగా రుణాలివ్వాలని జగన్ వినతి
ఏపీలో 219వ రాష్ట్రస్జాయి బ్యాంకర్ల సమావేశం ఇవాళ జరిగింది. ఇందులో బ్యాంకర్లు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 3.19 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక అందించాయి. ఇందులో ఇందులో 51.56శాతం వ్యవసాయ రంగానికి కేటాయించాయి. ఈ లెక్కన వ్యవసాయ రంగానికి 1.64 లక్షల కోట్లు ఇవ్వనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. దీనికి వివిధ వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బతీశాయని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయన్నారు.

2021-22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5శాతంగా ఉందన్నారు. అయితే అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీనికారణంగా వస్తున్న ఒత్తిళ్లతో ముడిచమురు, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. ఫలితంగా సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరిందని కేంద్ర గణాంకాలశాఖ వివరాలు వెల్లడించిందని జగన్ తెలిపారు. గత 8 ఏళ్ల వ్యవధిలో ఇదే అత్యధికం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38శాతం ఉందన్నారు. ఈ కారణాల వల్ల రిజర్వ్ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచిందన్నారు. అలాగే రెపోరేటును 40 బేసిక్ పాయింట్లు పెంచిందన్నారు. జూన్‌లో దీన్ని మరో 50 బేసిక్ పాయింట్లకు రిజర్వ్‌బ్యాంకు పెంచిందని, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోందని జగన్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6శాతానికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసిందని, దీనివల్ల నగదు నిల్వలు క్రమంగా తగ్గుతాయన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా దిగువ తరగతి వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. తయారీ రంగంపైకూడా ప్రతికూల ప్రభావం పడుతుందని జగన్ తెలిపారు.సరుకులు కొనేవారు లేకపోతే, వారు పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుందన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు విశేష కృషిచేయాల్సిన అవసరం ఉందని జగన్ వివరించారు.ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా అవసరమైన చర్యలను తీసుకోవాలని, తక్కువ వడ్డీలకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు.

ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేస్తోందని, అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రత్యక్షంగా నగదు బదిలీచేస్తోందని జగన్ తెలిపారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోందన్నారు.ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి, వారిని సాధికారితవైపు నడిపించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోందన్నారు. ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ 2020-21లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19శాతం చేరుకోవడం మనసారా అభినందనీయమని జగన్ తెలిపారు.కొన్ని రంగాల్లో బ్యాంకుల పనితీరు ప్రశంసనీయమన్నారు. అగ్రికల్చర్ టర్మ్ లోన్ విషయానికొస్తే వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న దానికన్నా 167.27శాతం సాధించారని, అలాగే ప్రాథమికేతర రంగానికి నిర్దేశించుకున్నదానికంటే రెట్టింపు రుణాలు అంటే 208.48శాతం ఇచ్చారన్నారు. అయితే మరికొన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ వివరించారు.