రమ్య హంతకుడికి ఉరిశిక్షను స్వాగతించిన జగన్, రోజా-న్యాయం జరిగిందన్న తల్లితండ్రులు
ఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన గుంటూరు రమ్య దారుణ హత్య కేసులో ఇవాళ గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు 9 నెలలుగా బెయిల్ కూడా ఇవ్వకుండా కఠినంగా విచారణ జరిపిన కోర్టు.. ఇవాళ ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని రమ్య తల్లితండ్రులతో పాటు పలువురు ప్రముఖులు స్వాగతిస్తున్నారు.
రమ్య హంతకుడు శశికృష్ణకు గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను సీఎం జగన్ తో పాటు మంత్రి రోజా, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్వాగతించారు. గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ సీఎం జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని అభివర్ణిస్తూ జగన్ ట్వీట్ చేశారు. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసు శాఖను అభినందిస్తున్నాను అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును స్వాగతించారు. 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని, 9 నెలల్లోనే ఉరిశిక్ష వేయించిన పోలీసుల్ని ఆమె అభినందించారు. ఇదంతా జగన్ సార్ గొప్పతనం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో నిందితులకు శిక్షలు పడితే ఆడపిల్లలకు రక్షణ ఉంటుందంటూ జగన్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. దిశ చట్టం కేంద్రంలో ఆమోదం పొందకపోయినా మిగతా చర్యలతో ఇలాంటి కేసును త్వరగా తేల్చడాన్ని ఆర్కే రోజా అభినందించారు. ఈ తీర్పుతో మహిళాలోకం జగనన్నకు జేజేలు కొడుతోందన్నారు.

మరోవైపు గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును రమ్య తల్లితండ్రులు కూడా స్వాగతించారు. ఇవాళ తీర్పు సందర్భఁగా కోర్టుకు హాజరైన రమ్య తల్లితండ్రులు తీర్పు రాగానే కన్నీళ్ల పర్యంతమయ్యారు. రమ్య సోదరితో పాటు తరలివచ్చిన తల్లితండ్రులు.. అప్పట్లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. రమ్య హంతకుడికి శిక్ష పడటంతో తమకు న్యాయం జరిగిందన్నారు. అయినా తమ బిడ్డ మాత్రం తిరిగి రాదన్నారు. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయంలో తమకు న్యాయం చేశారని, దిశ చట్టం ప్రకారం శిక్ష విధించడం న్యాయమేనన్నారు.