చిరంజీవి సభకు 41వేలమంది వచ్చారు కానీ, విజయమ్మా అంతే: ఆదినారాయణరెడ్డి
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సభలకు జనాలు వచ్చినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఓటు వేయరని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలవరని జోస్యం చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రకు జనాలు వచ్చినా లాభం లేదన్నారు.
రేపోమాపో చంద్రబాబుకు నోటీసులు? టీడీపీలో కలకలం: పవన్-జగన్ను లాగి...

విజయమ్మ 50వేల మందితో వచ్చి నామినేషన్ వేస్తే
గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. ఆ రోజు విజయమ్మ 50 వేల మందితో వచ్చి నామినేషన్ వేస్తే 91వేల భారీ మెజార్టీతో ఓడిపోయారని గుర్తు చేశారు.

చిరంజీవి సభకు 41వేల మంది వచ్చారు కానీ
కేవలం 500 మందితో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత హరిబాబు 91 వేల భారీ మెజార్టీతో గెలిచారని ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. అంతకుముందు 2009లో చిరంజీవి జమ్మలమడుగు సభకు 41వేల మంది వస్తే 4100 ఓట్లు వచ్చాయన్నారు.

ఏపీ రాజకీయాలపై చర్చించామని కన్నా
ఈ నెల 20వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వేరుగా చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించామన్నారు. 2019 ఎన్నికలకు సన్నద్ధం కావాలని కేంద్ర నాయకత్వం మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు.

రాహుల్ గాంధీతో టీడీపీ అక్రమ సంబంధం
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓ వైపు బీజేపీతో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నా ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పలు అంశాల్లో టీడీపీ అండగా నిలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ సిద్ధాంతాలను హత్య చేశారన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా కంపెనీగా మారిందన్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించాలన్నారు.