• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా బెజవాడ: చంద్రబాబుకు జగన్ లేఖ

By Nageswara Rao
|

అమరావతి: నవ్యాంధ్ర ప్రస్తుత రాజధాని విజయవాడలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్వవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. విజయవాడ హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారిందని అందులో పేర్కొన్నారు.

కాల్‌మనీ వ్యవహారాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే తెరవెనుక ఉండి నడిపించారని, బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు.

Ys Jagan wrote a letter to Chandrababu Naidu over call money issue

చంద్రబాబుకు వైయస్ జగన్ లేఖ: పూర్తి సారాంశం

గడిచిన నాలుగు రోజులుగా బయటకు వస్తున్న కాల్ మనీ- సెక్స్ రాకెట్ వ్యవహారం విస్మయాన్ని కలిగిస్తోంది. గత 19 నెలలుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు కొలువు తీరిన విజయవాడ.. సభ్య సమాజం, మొత్తంగా మానవజాతి తలదించుకునే స్థాయి హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారిందని వెల్లడవుతుంటే మొత్తంగా మానవజాతి తల దించుకునే స్థాయి హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారిందని వెల్లడవుతుంటే దేశం నివ్వెరపోతోంది.

కాల్ మనీ పేరిట పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నారని, కనీ వినీ ఎరుగని వడ్డీ సమర్పించుకోలేని కుటుంబాల్లో స్త్రీలను, యువతను చెరపడుతున్నారని వార్తలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దుర్మార్గానికి, అరాచకానికి.. రాక్షసత్వానికి మించిన హీన స్వభావానికి, మాటలకు అందని నీచ గుణానికి మూలాలు ఎక్కడ ఉన్నాయో, బాధ్యులు ఎవరో అందరినీ బయటకు లాగి చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉంది.

ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈ వ్యవహారంలో తెర వెనక ఉండి.. ఈ కాల్ మనీ కమ్ సెక్స్ మాఫియా వారితో పడుగూ పేకల్లా కలగలిసిపోయారని వెల్లడి అవుతోంది. వారి సొమ్ములతో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వాగతం పలికే ఫ్లెక్సీలు, తోరణాలు వెలవటంతో మొదలుపెట్టి.. మీ పార్టీ శాసన సభ్యుల్ని విదేశీ విహారాలు చేయించే వరకు ఈ కాల్ మనీ రావణాసురులే స్పాన్సర్లుగా ఉన్నారన్న పచ్చి నిజం ఇప్పుడు ప్రజల గుండెల్ని నిప్పులా దహిస్తోంది.

ఏం ముఖ్యమంత్రి గారూ.. చీటికీ, మాటికీ ప్రెస్ మీట్లు పెట్టి చిన్నా చితకా అంశాలమీద కూడా అనర్గళంగా అబద్ధాల ప్రసంగాలు చేసే మీకు కొత్త రాజధాని పరిధిలో వేల మంది స్త్రీలను మీ పార్టీ రావణ, దుర్యోధన, దుశ్శాసన సంతతి నెలల తరబడి చెరపడుతున్న విషయం బట్టబయలు అవుతున్నా నోరు మెదపాలని.. చట్టం దన్నుగా ప్రజలను కాపాడాలని, ఈ రాక్షస సంతతిని వేరు మూలాలతో తుద ముట్టించాలని మీ గుండెలో, హృదయంలో కదలిక రాలేదా?

పైగా మీరు చేస్తున్న ప్రయత్నాలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి. మీ పార్టీ వారంతా మీ అండ చూసుకుని ఎంతటి అరాచకం అయినా చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చి సాగిస్తున్న ఈ సిగ్గు మాలిన రాక్షసకాండ నుంచి వారిని ఎలా తప్పించాలా అన్న ఆలోచనతో, మిగతా రాజకీయ పార్టీల వారు ఈ కాల్ మనీ వ్యవహారంలో ఉన్నారని కేసులు పెట్టాల్సిందిగా మీరే మీ అనుచరులకు ఆదేశాలిచ్చారన్నది మాకున్న సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ... ఇలా అన్ని పార్టీలకూ ఈ కాల్ మనీ బురదను అంటించటానికి మీ అనుంగు పోలీసు బాసులకు ఆదేశాలివ్వటం నిజమైతే.. మొత్తంగా మీ వల్ల, మీ చేత జరిగిన ఈ అత్యాచారాన్ని కూడా రాజకీయం అనే కార్పెట్ కింద కప్పి పెట్టాలన్న మీ ఆలోచనే అన్నింటికంటే ఘోరమైన నేరం.

మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించటంతో పాటుగా.. తెలుగు దేశం పార్టీ వారు ఎంతటి ఘోరాలూ, నేరాలూ చేసినా చట్టానికి దొరక్కుండా కాపాడుకుంటారన్న మీ స్వభావం, మీ ప్రభుత్వ వ్యవహారం ప్రజలకు బాగా అర్థం అయింది. కాబట్టే, బాధితులు దైర్యంగా ముందుకు వచ్చి కనీసం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు. తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకు ఈడ్చిన, అటవీ అధికారులమీద దాడి చేసి కొల్లేరులో సొంత రోడ్డు వేసుకున్న అంగన్ వాడీలను సభ్యసమాజం రాయలేని, వినలేని భాషలో అన్యాయంగా దుర్భాషలాడిన మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద కేసులు లేకుండా చేయటమే కాకుండా, బిరుదు సత్కారాలు చేసి.. రాష్ట్రంలోనే పనితీరులో నెంబర్ వన్ ఎమ్మెల్యేగా సన్మానిస్తుంటే ఈ రాక్షస రాజ్యంలో పోలీసులకు తమ గోడు చెప్పుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది? వనజాక్షిని మీ ఇంటికి పిలిచి మీరే బెదిరించిన నేపథ్యంలో మీ పార్టీ నాయకుల రాక్షస కృత్యాలను అడ్డుకునే సాహసం ఏ రెవెన్యూ అధికారికి ఉంటుంది? రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపల్ ను మీరు వెనకేసుకు వస్తున్న తీరు చూసిన తరువాత ఏ తల్లిదండ్రులకు తమ బిడ్డల రక్షణ విషయంలో భరోసా ఉంటుంది?

కల్తీ మద్యాన్ని మీ ప్రభుత్వమే సరఫరా చేసి, మీరు పెట్టించిన షాపుల్లో మనుషులు చనిపోతుంటే కారకులైన మంత్రుల్ని వదిలి ఎస్సైల మీద చర్యలు తీసుకుంటే ప్రజలకు ఎలాంటి సంకేతం వెళుతోంది? మొదటి కలెక్టర్ల కాన్ఫెరెన్స్ లోనే మీరు మీ పార్టీ న్యాయకుల వ్యవహారాలను చూసీచూడనట్లు పొండని ఆర్డర్ వేసిన తరువాత.. ఐఏఎస్ లూ, ఐపీఎస్ ల యూనిఫాంకు విలువ ఇంకెక్కడుంది? నిజాయతీతో మీ నాయక గణాల ఆగడాలను అడ్డుకున్న సివిల్ సర్వేంట్ కు దక్కిన ట్రాన్స్ ఫర్ సన్మానాలతో ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం అనే పదాలకు అర్ధం లేకుండా చేసి.. సంపూర్ణమైన దోపిడీ, మాఫియా రాజ్యానికి సర్వం సహాధికారిగా మీరే మారారు. ప్రభుత్వాన్ని ధిక్కరించి మాఫియా తయారు కావటాన్ని విన్నాంగానీ, ప్రభుత్వమే మాఫియాగా తయారై గ్రామ గ్రామానా ఇసుక దోపిడీ మొదలు, జన్మభూమి కమిటీలు మొదలు.. ప్రజాస్వామ్యం మూలాలన్నింటినీ నిర్వీర్యం చేసి సహజ సంపదలనే కాకుండా.. కుటుంబంలో చొరబడి, బెదిరించి, స్త్రీలను చెరబట్టి దోచుకుంటున్న వ్యవస్థ మీ పరిపాలనలో తప్ప ప్రపంచ చరిత్రలో మరొకటి ఉందా?

మొత్తంగా తెలుగు సమాజం రగిలిపోయే అరాచకాలకు మీరు పరిపాలన అని పేరు పెట్టుకుంటారా? కింది స్థాయి నుంచి మీ వరకూ లంచాలు పంచుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎవరకి భరోసా ఇస్తుంది? స్థానికంగా మీకు అమ్ముడు పోయిన మీడియాను, మీకున్నపరిచయాలతో జాతీయ మీడియాను మేనేజ్ చేసుకుని మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో వారి నిజాయితీ గురించి, వారి సచ్ఛీలత గురించి, సత్యసంధత గురించి ఇంటర్య్వూలు ఇప్పించుకుంటున్న తీరు చూసి తెలుగు జాతిమొత్తం అసహ్యించుకుంటోంది.

అధికారంలోకి వస్తే మహిళలందరికీ అభయం ఇస్తానని, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుందని, ఫోన్ చేసిన అయిదు నిమిషాలలోనే పోలీసులు వచ్చి వాలతారని ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన ప్రకటనలు ఒక్కసారి తెప్పించుకుని చూడండి ముఖ్యమంత్రి గారూ! లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, సెక్స్ మాఫియా, మనీ మాఫియా.. ఒక్కటని ఏముంది? విజయవాడను మీ ఆధ్వర్యంలో వంద రకాల మాఫియాలకు రాజధానిగా తయారు చేసి పెంచి పోషిస్తున్న వైనం సామాజికంగా, విలువల పరంగా మీరు ఇంకా దిగజారటానికి మరేమీ లేదన్న భావన కలిగిస్తోంది.

చిట్టచివరగా మీ సందేశం ఏమిటంటే.. కాల్ మనీ వ్యాపారులకు డబ్బు తిరిగి చెల్లించవద్దు అని! భేష్ చంద్రబాబు గారూ! సమస్య కేవలం డబ్బు కాదు అని మీకు తెలియదా?నెలల క్రితమే మీకు నేరుగా ఈ రాక్షస కాండ గురించి చెప్పినా స్పందించలేదని బాధితులు ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు. మీ పార్టీకి చెందిన మనీ రాక్షసులు వసూలు చేసి వందల కోట్ల వడ్డీలు, సాగించిన మహా అరాచకాలు, కుటుంబాల్లోకి చొరబడి.. కాపురాలను ఛిద్రం చేసి.. మహిళల్ని చెరబట్టి సాగించిన అత్యాచారాలన్నింటికీ వ్యక్తిగతంగా, నైతికంగా, రాజకీయంగా, అధికార పరంగా సంపూర్ణంగా బాధ్యత వహించాల్సిన మీరు ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే చౌకబారు వ్యూహాలను కట్టిపెట్టండి.

1) ఇది మీ అండ చూసుకని సాగించిన రాక్షస కాండ కాబట్టి, బాధ్యత వహించండి

2) ఈ రాక్షస కాండలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ.. శాసన సభ్యుడైనా, మంత్రి అయినా చట్టం ముందు నిలబెట్టండి. క్షమించరాని ఘోరాతి ఘోరమైన నేరాలకు పాల్పడిన మీ పార్టీ వారిని చట్టానికి చిక్కకుండా తప్పించే వ్యవహారంలో భాగంగా, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగా.. మిగతా పార్టీల వారి మీద దొంగ కేసులు పెట్టాలనే ఆలోచనలు మానుకోండి.

3) బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్పేందుకు కావాల్సిన భరోసా, రక్షణ ఇవ్వకుండా.. వారిని మరో వంక భయభ్రాంతులకు గురిచేసే కౌటిల్యాన్నికట్టిపెట్టండి

4) కాల్ మనీ పేరిట అప్పులిచ్చి వసూలు చేసిన వడ్డీ ప్రతీ పైసానూ కక్కించి బాధితులకు తిరిగి ఇవ్వండి.

5) మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులకు కాల్ మనీ రాకెట్ కు ఉన్న సంబంధాలను, అనుబంధాలను, ఆర్ధిక బంధాలను, ప్రచార బంధాలను.. అన్నింటినీ బట్టబయలు చేయండి

6) మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నామొత్తం వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా నేరుగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిగేలా ఎంక్వైరీ కోరండి.

ఇట్లు

- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

English summary
Ys Jagan wrote a letter to Chandrababu Naidu over call money issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X