వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుల షాక్: టిడిపి వైపు జగన్ పార్టీ ఎమ్మెల్యేల చూపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు గోడ దూకే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే పలువురు టిడిపి వైపు చూస్తున్నారనే ప్రచారం జరగడం గమనార్హం. టిడిపి ప్రభుత్వం ఏర్పడటం, జగన్ కేసుల్లో ఇరుక్కున్న నేపథ్యంలో అభద్రతాభావంలో ఉన్న పలువురు సేఫ్ జోన్లు వెతుకుతున్నారంటున్నారు.

ఇంకొదరికి పిలుపులు వస్తున్నాయట. ఈ పరిణామంతో ఫ్యాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను అభద్రత వెంటాడుతోందంటున్నారు. భవిష్యత్తు దృష్ట్యా పార్టీలోనే ఉందామా లేక జంప్ అవుదామా అనే ఆలోచనలో పలువురు ఉన్నారట. అధికారాన్ని చేజిక్కించుకుంటామన్న ధైర్యంతో మూడేళ్లుగా జగన్ వెంట నడిచారు. 16 నెలలపాటు ఆయన జైల్లో ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అధికారం కోసం తీవ్రంగా శ్రమించారు. తీరా చూస్తే అధికారం అందకుండా పోయింది. దీంతో వారు ఆలోచనలో పడ్డారట. అక్రమాస్తులకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌కు అధికారం దక్కలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఆయన జైలుకు వెళితే తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది? తదితర అంశాలను ఊహించుకొని తాజా ప్రజా ప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.

YSR Congress LP to hold meeting on 21 may

జగన్ జైలుకు వెళ్లకపోతే ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదురొడ్డి నిలబడవచ్చని, కానీ, ఆయన మళ్లీ జైలుకు వెళ్తే ఇబ్బంది తప్పదని మదన పడుతున్నారట. కేవలం ఆయన బెయిలుపైనే బయట ఉన్నాడని, ఒకవేళ ఆయన మళ్లీ జైలుకు వెళితే పార్టీని ముందుకు నడిపించే సత్తా ఎవరికి ఉందని అంతర్మథనం చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గోడ దూకి అధికార పార్టీల్లో చేరితే ఐదేళ్లపాటు ఏదో రకంగా భవిష్యత్తు అయినా ఉంటుందని వారు ఆలోచిస్తున్నారట.

జగన్ పార్టీకి చెందిన ఇటీవలి మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అంతర్మథనం మొదలైనట్లుగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదు. అది కేవలం రిజిస్టర్డ్ పార్టీయే. దీంతో, ప్రతినిధులకు విప్ వర్తించదని, విప్ తమకు వర్తించదని, గోడ దూకినా తమపై కొరఢా ఝళిపించే వాళ్లే ఉండరని చర్చ జరుగుతోందట.

ఈ నేపథ్యంలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇటీవల జడ్పీటీసీలుగా ఎన్నికైన వారు సైతం గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారట. ఎంపీలు అయితే, సాధ్యమైనంత త్వరగా బిజెపి లేదా టిడిపిలోకి చేరితే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.

21న ఇడుపులపాయలో ఎల్పీ సమావేశం

ఈనెల 21న ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక జరగనుంది. ఇదే సమయంలో పార్లమెంటరీ పార్టీ నేతను కూడా ఎంపిక చేయనున్నారు. తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా 21న ఇడుపులపాయ చేరుకుని వైయస్ సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. పలువురి అంతర్మథనం నేపథ్యంలో ఈ సమావేశానికి ఎవరెవరు వెళ్తారనేది ఉత్కంఠగా మారింది.

English summary
YSR Congress Legislature Party to hold meeting on 21 may.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X