వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిచ్చు రేపిన చంద్రబాబు వ్యాఖ్య: వక్రీకరించారని టిడిపి నేతల సర్దుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య రాజకీయంగా దుమారం రేపుతోంది. దాన్ని వివాదంగా మార్చేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరించారని తెలుగుదేశం పార్టీ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎస్సీగా ఎందుకు పుట్టాలని అనుకోలేదో చంద్రబాబు చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతారా అని ఆమె ప్రశ్నించారు. కులరాజకీయాలు చేస్తున్నారని ఈ మధ్య చంద్రబాబు చాలా సార్లు వ్యాఖ్యలు చేశారని అంటూ అయితే కుల రాజకీయాలు చేసింది, కులాల గురించి ప్రస్తావించింది మీరు కాదా అని అడిగారు.

గతంలో దళితులు, బీసీల మధ్య తగాదాలు పెట్టింది చంద్రబాబు కాదా అని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. కులాల గురించి ఇలా మాట్లాడడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎస్సీలను అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడడం హేయమని అన్నారు.

YSR Congress party leaders slams chandrababu naidu

ఎస్సీల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తాము అవమానంగా భావిస్తున్నామని ఆమె చెప్పారు ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారని, గెలుపే లక్ష్యంగా హామీలే మార్గంగా ఎన్నికల సమయంలో వ్యవహరించిన చంద్రబాబు వాటిని తీర్చలేక పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.

బీసి నాయకుడికి సీటిస్తే టిడిపి ఓడిపోయిందని అన్నారని, దళితుడికి సీటిస్తే బలం తగ్గిపోయిందని అన్నారని, చంద్రబాబుకు కింది నుంచి పైదాకా కుల వివక్ష ఉందని ఆమె విమర్శించారు. అసలు చంద్రబాబు ఏం అనుకుంటున్నారో ఏ మాత్రం అర్థం కావడం లేదని కల్పన అన్నారు.

అంబేడ్కర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి...

చంద్రబాబు తన మాటలతో దళితుల్ని అవమానించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మండిపడ్డారు. దళితుల పట్ల వివక్షతో కూడిన మాటలు మాట్లాడారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో ఆరోపించారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలు తమని బాధించాయన్నారు.

తెలుగుదేశం పార్టీ దళిత నేతలకు సిగ్గుంటే చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన శ్రీనివాసులు తన వ్యాఖ్యలపై అంబేద్కర్‌ కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ కోరాలన్నారు.

మరో జన్మంటూ ఉంటే ఎస్సీ కులంలో పుడుతా...

ఎస్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరూ కోరుకోరని సీఎం అనడం సరికాదన్నారు. వచ్చే జన్మంటూ ఉంటే ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటానన్నారు.

మేనిఫెస్టోలో కులాల ప్రస్తావన తెచ్చింది టీడీపీనే అని గుర్తుచేశారు. వచ్చే విద్యాసంవత్సరానికి కాపులను బీసీల్లో చేర్చాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా 39 కులాలకు హామీ ఇచ్చారని, కేవలం కులాలకే 196 హామీలు ఇచ్చారని ఆయన చెప్పారు.

మందకృష్ణకు ఎన్ని ఓట్లొచ్చాయి...

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. దళితుడైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశారని గుర్తు చేశారు. రాజకీయాలు-కులం వేరని చంద్రబాబు విశ్లేషించారని అయితే వైసీపీ గడ్డిపోచతో సముద్రాన్ని ఈదాలనుకుంటోందని మండిపడ్డారు. మధిరలో 48 వేల మాదిగ ఓట్లుంటే మందకృష్ణకు 25 వేల ఓట్లే వచ్చాయని వర్ల అన్నారు.

YSR Congress party leaders slams chandrababu naidu

కృష్ణయ్యకు పరిస్థితి వివరిస్తాం...

కాగా, టీడీపీతోనే బీసీలకు గుర్తింపు వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీల సంక్షేమానికి సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు ఆయన మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. గత పాలకులు బీసీల నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కొంతమంది కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఆర్‌. కృష్ణయ్యకు పరిస్థితిని వివరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

చంద్రబాబు అవమానించేలా మాట్లాడలేదు...

చంద్రబాబు దళితులను అవమానించే విధంగా మాట్లాడలేదని మాల మహానాడు నేత కారెం శివాజీ అన్నారు. ఓ పత్రిక కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఉన్నంత వరకు బీసీలకు అన్యాయం జరగదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలకు బీసీలు, కాపులు దూరంగా ఉండాలని కాల్వ విజ్ఞప్తి చేశారు.

పైరవీలు చేసేవారే...

పదవులు కోరుకునే, పైరవీలు చేసే దళిత నేతలే చంద్రబాబును వెనుకేసుకొస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు న్యాయం చేయలేని చంద్రబాబు కాపులకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. గ్రేటర్‌ ఎన్నికలు, కాపు ఉద్యమం నేపథ్యంలో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని మందకృష్ణ మాదిగ విమర్శించారు.

English summary
YSR Congress party leaders Uppuleti Kalpana and srinivasulu lashed out on Andhra Pradesh CM Nara Chanadrababu Naidu comments on caste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X