• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామపై అనర్హత వేటు- వైసీపీ మౌనం వెనుక ఏముంది ? బీజేపీ జోక్యంతో వ్యూహాత్మక అడుగు ?

|

ఏపీలో వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరులో ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు ఈసారి వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. రఘురామరాజు అనర్హతపై ఏదో ఒకటి తేల్చాలని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు పార్లమెంటులో నిరసనలు చేపడతామని వర్షాకాల సమావేశాలకు ముందు వైసీపీ ఎంపీలు హెచ్చరికలు కూడా చేశారు. రఘురామకు వారంలో నోటీసులు, ఆ తర్వాత వేటు పడుతుందని కూడా చెప్పారు. తీరా పార్లెమంటు సమావేశాలు మరో రెండు వారాల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో వైసీపీ మౌనం అనుమానాలకు తావిస్తోంది.

 రఘురామ వర్సెస్ జగన్

రఘురామ వర్సెస్ జగన్

ఏపీలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే ఆరు నెలల్లో సమర శంఖారావం పూరించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ రెండేళ్లలో పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం జగన్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల హామీల్ని టార్గెట్ చేస్తూ రఘురామరాజు జగన్ కు రాసిన లేఖలు ప్రజల్లో చర్చనీయాంశం కాగా.. ప్రధాని, గవర్నర్, ఎంపీలకు రాసిన లేఖలతో ఆయనకు జాతీయ స్ధాయిలో కూడా మైలేజ్ లభించింది. అన్నింటికీ మించి జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసిన తర్వాత తనను టార్గెట్ చేశారంటూ జాతీయ స్ధాయిలో రఘురామ సాగించిన ప్రచారానికి కూడా మద్దతు లభించింది. దీంతో కేంద్రంలో పెద్దలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా రఘురామకు అపాయింట్మెంట్లు ఇచ్చి మరీ ఆదరించారు. ఇలాంటి సమయంలో వైసీపీకి ఉన్న ఏకైక మార్గం ఆయనపై అనర్హత వేటు వేయించడమే.

 రఘురామపై వేటుకు వైసీపీ ఫిర్యాదు

రఘురామపై వేటుకు వైసీపీ ఫిర్యాదు

రఘురామరాజు తమ పార్టీ తరఫున గెలిచి పార్టీతో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసేందుకు తగిన కారణమే అంటూ వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను ఆశ్రయించారు. రఘురామరాజుపై ఏకంగా 270 పేజీల ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. కానీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రం ఏడాదిగా మౌనంగానే ఉండిపోయారు. చివరికి ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎలాగైనా రఘురామరాజుపై వేటు వేయించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ.. తుది ప్రయత్నానికి సిద్ధమైంది. రఘురామపై తాము ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందించడం లేదంటూ లోక్ సభ స్పీకర్ కు మరింత ఘాటుగా లేఖ రాసిన విజయసాయిరెడ్డి.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తద్వారా ఈ వేటు ఆలస్యమైతే ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని చెప్పకనే చెప్పేశారు.

 రఘురామకు స్పీకర్ నోటీసులు

రఘురామకు స్పీకర్ నోటీసులు

రఘురామరాజు తమ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై తొలుత మౌనంగా ఉన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎట్టకేలకు కదిలారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న సమయంలో రఘురామరాజుకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. సమాధానం చెప్పేందుకు 15 రోజుల గడువు కూడా విధించారు. అయితే ఈ గడువు గత నెల 30వ తేదీనే ముగిసిపోయింది. అయినా ఇప్పటికీ రఘురామరాజు సమాధానం చెప్పారో లేదో కూడా ఎవరికీ తెలియని పరిస్ధితి. అప్పటివరకూ రఘురామపై అనర్హత వేటు కోసం పోరాటానికి సిద్ధమైన వైసీపీ కూడా ఇప్పుడు ఈ విషయంపై నోరు మెదపడం లేదు.

రఘురామపై వెనక్కి తగ్గారా ?

రఘురామపై వెనక్కి తగ్గారా ?


రఘురామరాజుకు లోక్ సభ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై ఆయన సమాధానం చెప్పారో లేదో అన్న సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలోనే వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు ముందు రఘురామపై వేటు వేసే వరకూ పార్లమెంటులో నిరసనలు తెలుపుతామంటూ హెచ్చరికలు చేసిన వైసీపీ ఎంపీలు ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. స్పీకర్ నోటీసులకు రఘురామ సమాధావం చెబితే, వైసీపీ తరఫున కూడా వివరణ ఇచ్చి త్వరగా అనర్హత వేటు కోరే అవకాశం ఉంది. లేకపోతే ఈ వ్యవహారం ఆలస్యం అవుతుంది కాబట్టి లోక్ సభ స్పీకర్ పై, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంటులో నిరసనలు తెలిపే అవకాశం కూడా ఉంది. అయినా ఈ రెండింటినీ ఆశ్రయించకుండా వైసీపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించడమే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. దీంతో ప్రస్తుతానికి రఘురామపై వైసీపీ వెనక్కి తగ్గిందా అన్న చర్చ సాగుతోంది.

  Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu
   బీజేపీ పెద్దల సూచనతోనే ?

  బీజేపీ పెద్దల సూచనతోనే ?

  రఘురామరాజుపై అనర్హత వేటుకు సంబంధించి ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పట్టుబట్టాలని, నిరసనలకు దిగాలని వైసీపీ ముందే నిర్ణయించుకుంది. కానీ పార్లమెంటు సమావేశాలు తుది దశకు చేరుకుంటున్నప్పటికీ వైసీపీ మౌనాన్నే ఆశ్రయిస్తోంది. దీని వెనుక బీజేపీ పెద్దల సూచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంటులో పెగాసస్ వివాదాన్ని పట్టుకుని ఎన్డీయే సర్కార్ ను విపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై విపక్షాలకు సర్దిచెప్పే పరిస్ధితి లేదు. పెగాసస్ పై సుప్రీంకోర్టులో విచారణకు రంగం సిద్ధమవుతున్నా పార్లమెంటులో విపక్షాల ఆందోళనలు మాత్రం ఆగడం లేదు . దీంతో ఇదే సమయంలో రఘురామరాజుపై వేటు కోసం వైసీపీ నిరసనలు చేపడితే మరింత గందరగోళం తప్పదన్న అంచనాతో బీజేపీ పెద్దలు వైసీపీకి నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ రఘురామరాజుపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు అర్దమవుతోంది.

  English summary
  ysrcp maintaining strategic silence over raghurama krishnam raju's disqualification amid opposition protests over pegasus and other issues in parliament.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X