ఆరుగురు ఎమ్మెల్సీల ఏకగ్రీవం: రామచంద్రయ్య, దువ్వాడ సహా వీరే, మండలిలో పెరిగిన వైసీపీ బలం
అమరావతి: ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సి రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, మహమ్మద్ ఇక్బాల్, చల్లా భగీరథ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కరీమున్నీసా నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ ఆరుగురు అభ్యర్థులు మినహా మరే ఇతర నామినేషన్లు దాకలు కాకపోవడంతో వారంతీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

అసెంబ్లీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డికి ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి అందజేశారు.
తాజాగా, కొత్తగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలో శాసనమండలిలో చేరడంతో వైసీపీ బలం కూడా పెరిగినట్లయింది. ప్రస్తుతం ఈ ఆరుగురితో మండలిలో వైసీపీ బలం 18కి చేరింది. దీంతో మండలిలో కూడా టీడీపీ మరింత బలంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీడీపీ సభ్యుల బలం 26గా ఉంది. పీడీఎఫ్‌కు చెందిన ఐదుగురు, బీజేపీకి చెందిన ముగ్గురు, ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. మరో మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది.