పవన్ పై వైసీపీ "మెగా"స్త్రం - కొత్త సమీకరణాలతో ముందుకు : సీఎం నేడు తేల్చేస్తారా..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడిస్తామని శపథం చేసారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. రాజకీయాల కోసం కాకుండా.. రాష్ట్రం కోసం కలిసొచ్చే పార్టీలు ఏకం అవుతామని వెల్లడించారు. జగన్ లక్ష్యంగానే పవన్ ప్రసంగం కొనసాగింది. రాజకీయంగానూ పవన్ లక్ష్యంగా జగన్ మాత్రమేనని తేలిపోయింది. 2014 ఎన్నికల నుంచి ఇదే విధంగా జగన్ వర్సెస్ పవన్ రాజకీయం ఏపీలో కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ను ఓడించాలంటే వ్యతిరేక ఓటు చీలకూడదనే సూత్రాన్ని పవన్ బలంగా ప్రస్తావిస్తున్నారు.

జగన్ ను అలా అయితేనే ఓడించగలరా
దీని ద్వారా పరోక్షంగా అందరూ ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ సైతం తనను అధికారం నుంచి దింపటమే లక్ష్యంగా అందరూ ఒకే వాయిస్ వినిపిస్తున్న అంశాన్ని గుర్తించారు. దీని ద్వారా జగన్ ను ఒంటరిగా ఓడించలేమనే అంశాన్ని పవన్ పరోక్షంగా అంగీకరించారనేది వైసీపీ నేతల విశ్లేషణ. అయితే, ఒంటరిగానే వారిని ఎదుర్కోవటానికి జగన్ సిద్దం అవుతున్నారు.
ఇక, వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పైన చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చి ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలు అమలు చేస్తున్నారు. సభలో అందరికీ నమస్కారం చేసిన పవన్..తన ఎదుగుదల కు కారణమైన చిరంజీవికి నమస్కరించలేదేంటని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి సంస్కారం గురించి గతంలోనూ అనేక సార్లు వైసీపీ మంత్రులు గొప్పగా చెప్పుకొచ్చారు.

చిరంజీవితో సన్నిహిత సంబంధాలతో
అదే విధంగా సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంలోనూ చిరంజీవికి పెద్దరికం అప్పగించటం..ఆయన కోరిన విధంగా సమస్యలను పరిష్కరించటం ద్వారా పరోక్షంగా పవన్ విమర్శలకు చిరంజీవి సమాధానం చెప్పే విధంగా స్కెచ్ అమలు చేస్తున్నారు. పవన్ ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న సమయంలోనే...ప్రభుత్వ నిర్ణయాలు కొన్నింటిని చిరంజీవి ప్రశంసించారు. మూడు రాజధానుల అంశం నుంచి తాజాగా సినిమా టిక్కెట్ల వ్యవహారం వరకూ జగన్ తో చిరంజీవి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.
ఒక దశలో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సైతం వైసీపీ అధినాయకత్వం సిద్దంగా ఉందనే ప్రచారం సాగింది. కానీ, తాజాగా చిరంజీవి దీని పైన స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో రానున్న కేబినెట్ విస్తరణ.. నిర్ణయాల విషయంలోనూ సామాజిక సమతుల్యత పాటించటం పైన జగన్ ఫోకస్ పెట్టారు.

కొత్త వ్యూహాలతో సీఎం జగన్
అందులో భాగంగా.. తాజాగా రాజ్యసభ స్థానాల కేటాయింపులో కాపులకు ఒక సీటు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో పాటుగా.. కాపు నేతలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ రోజు జరగనున్న పార్టీ ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేల సమావేశంలోనూ సీఎం జగన్ తన రూట్ మ్యాప్ ఏంటనేది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు.. జగన్ ను ఓడించేందుకు వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని చెబుతున్న ప్రయత్నాల పైన జగన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది.
ఇక, పవన్ విమర్శల పైన మంత్రులు సీరియస్ అవుతున్నారు. పేర్ని నాని..వెల్లంపల్లి..అవంతి శ్రీనివాస్ సభలో పవన్ చేసిన వ్యాఖ్యల పైన ఫైర్ అయ్యారు. గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ రోజు సమావేశంలో పవన్ కళ్యాన్ వ్యాఖ్యల పైన సీఎం జగన్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.