వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ డబుల్ గేమ్ బట్టబయలు-కేంద్రంలో వాటికి మద్దతు-రాష్ట్రంలో భారత్ బంద్ కు సపోర్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో సంబంధాలను అమాంతం పెంచుకున్నారు. రాష్ట్ర అవసరాలో, తన అవసరాలో తెలియదు కానీ ఎన్టీయే సర్కార్ అడిగింతే తడవుగా ప్రతీ దానికీ తలూపడం నేర్చుకున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధుల గెలుపుకు మద్దతు పలికిన వైఎస్ జగన్.. ఆ తర్వాత కీలకమైన వ్యవసాయ బిల్లులకు సైతం పార్లమెంటులో మద్దతిచ్చేశారు. దీంతో ఈ బిల్లులు కాస్తా చట్టాలుగా మారిపోయాయి. ఆ తర్వాత రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడం మానేశారు. కానీ ఈ రెండు అంశాలపై రేపు జరుగుతున్న భారత్ బంద్ కు మాత్రం మద్దతిస్తున్నారు.

కేంద్రంతో జగన్ సంబంధాలు

కేంద్రంతో జగన్ సంబంధాలు

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో ఏపీలో వైసీపీ సర్కార్ చెట్టపట్టాలేసుకుని తిరగడం 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదలైంది. ఆ తర్వాత పార్లమెంటులో పలు కీలక బిల్లుల విషయంలో జగన్ కేంద్రానికి మద్దతిచ్చినా ఆ మేరకు రాష్ట్ర ప్రయోజనాల్ని, గతంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని మాత్రం సాధించుకోలేకపోయారు. దీంతో కేంద్రంతో జగన్ వన్ సైడ్ లవ్ పై చర్చలు మొదలయ్యాయి. ఇఫ్పటికీ అదే పరిస్ధితి కొనసాగుతోంది. గతంలో విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చని కేంద్రానికి జగన్ ఎందుకు మద్దతిస్తున్నారనేది గమనిస్తే అసలు కారణం ఇట్టే అర్ధమవుతుంది. విపక్షాలు చెప్తున్నట్లుగా తన కేసుల కోసమే జగన్ కేంద్రం చెప్పినట్లు వింటున్నారనే సత్యం బోధపడుతుంది.

 వ్యవసాయ బిల్లుల్ని గట్టెక్కించిన జగన్

వ్యవసాయ బిల్లుల్ని గట్టెక్కించిన జగన్

దేశంలో రైతుల ఉసురుతీసేలా రూపొందించిన కార్పోరేట్ వ్యవసాయ బిల్లుల్ని రైతుల పక్షపాత పార్టీలుగా చెప్పుకునే ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించారు. ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఏపీలో రైతు ప్రభుత్వం నడుపుతున్నట్లుగా చెప్పుకుంటున్న వైసీపీ మాత్రం వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రానికి అండగా నిలిచించి.. లోక్ సభలో బీజేపీకి ఎలాగో మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభకు వచ్చేసరికి ఎన్డీయేకు తమ కూటమిలో లేని ప్రతీ ఎంపీ కీలకంగా మారిపోయారు. అలాంటి సమయంలో వైసీపీ తన ఆరుగురు ఎంపీల మద్దతు ఇవ్వకపోతే ఈ బిల్లులు వీగిపోయి ఉండేవి. కానీ విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా వైసీపీ మాత్రం ఈ నల్ల బిల్లులకు మద్దతిచ్చి రైతుల ఉసురుతీసేందుకు ప్రత్యక్ష కారణంగా నిలిచింది.

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపైనా

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపైనా

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు రెండేళ్ల క్రితమే రంగం సిద్దం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏడాది క్రితమే వైసీపీ సర్కార్ కు సమాచారం కూడా ఇచ్చింది. కేంద్రంలోని పెద్దల వద్దకూ తరచూ ప్రదక్షిణాలు చేసే జగన్ కు ఏదో ఓ సందర్భంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం చెవిలో పడింది. అయినా దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ సర్కార్ చేసిందేమీ లేదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామంటూ పాదయాత్రలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల తర్వాత తిరిగి దానిపై మాట్లాడింది లేదు.

అప్పట్లో ప్రధానికి లేఖలు రాసిన జగన్ తిరిగి దాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు శూన్యం. కనీసం క్షేత్రస్ధాయిలో అయినా పోరాటాలకు మద్దతుగా వైసీపీ పాల్గొంటుందా అంటే అదీ లేదు. ఓ దశలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తులు తీసుకోకుండా తామే కొనుగోలు చేస్తామంటూ బీరాలు పలికింది. కానీ ఇప్పటివరకూ దానిపై నోరు మెదిపింది లేదు. మరోవైపు కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. దీంతో వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సాఫీగా సాగిపోయేందుకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు తేలిపోయింది.

కేంద్రంలో సై.. రాష్ట్రంలో నై

కేంద్రంలో సై.. రాష్ట్రంలో నై

కేంద్రంలో వ్యవసాయ బిల్లులతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతిచ్చిన వైసీపీ.. ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం మొసలి కన్నీరు కారుస్తోంది. కేంద్రంలో ఏ అంశాలకు మద్దతిచ్చిందో రాష్ట్రంలో అవే అంశాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పుకుంటోంది. తన చర్యల ద్వారా కేంద్రానికి ఏమాత్రం ఆగ్రహం కలగకూడదనే ధోరణితో అక్కడ సమర్ధిస్తున్న వైసీపీ ఇక్కడికి వచ్చే సరికి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటోంది. దీంతో ఇప్పటివరకూ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కానీ, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి అదనపు నిధులు కానీ లేకుండా పోతున్నాయి. పోలవరం వంటి కీలక అంశాల్లోనూ మొండిచేయే ఎదురవుతోంది.

భారత్ బంద్ సపోర్ట్ తో డబుల్ గేమ్ బట్టబయలు

భారత్ బంద్ సపోర్ట్ తో డబుల్ గేమ్ బట్టబయలు

తాజాగా వైసీపీ సర్కార్ రేపు రైతు సంఘాల సమస్య అయిన వ్యవసాయ బిల్లులు, కార్మికులు వ్యతిరేకిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లైవేటీకరణ వ్యవహారాలపై నిర్వహిస్తున్న భారత్ బంద్ కు మద్దతు పలికింది. ఈ బంద్ కు దూరంగా ఉంటే ఈ రెండు అంశాలకు తాము అనుకూలమన్న సంకేతాలు వెళ్తాయేమో అన్న భయం వైసీపీని వెంటాడుతోంది.

దీంతో వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తున్నామని సమాచార శాఖ మంత్రి పేర్నినాని నిన్న చెప్పుకొచ్చారు. దీంతో అటు కేంద్రంలో మద్దతు పలుకుతున్న అంశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతివ్వడం ద్వారా వైసీపీ తన డబుల్ గేమ్ ను బయటపెట్టుకుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి అంతా బావున్నట్లే కనిపిస్తున్నా రేపు కేంద్రంతో గిల్లికజ్జాలు మొదలైతే మాత్రం భారత్ బంద్ కు వైసీపీ మద్దతు వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చే ప్రమాదం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. కానీ వైసీపీ మాత్రం ప్రస్తుత రాజకీయ ప్రయోజనాలపైనే లెక్కలు వేసుకుంటోంది.

English summary
ysrcp government's open support to tomorrow's bharat bandh seems to give indications on their double game on key issues like farm laws and vizag steel plant privatisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X