andhra pradesh ap high court nimmagadda ramesh kumar ysrcp ministers mlas notices kodali nani peddireddy ramachandra reddy jogi ramesh ap govt వైఎస్సార్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కొడాలి నాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ ప్రభుత్వం politics
నిమ్మగడ్డ జోరు- వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల బేజారు- హైకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలకు దిగిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు రెండోదశ ఎన్నికలకు చేరుకున్నా విమర్శల దాడి ఆపడం లేదు. ముఖ్యంగా బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయాల్సింది పోయి నిత్యం ఎస్ఈసీ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎస్ఈసీ కూడా వీరికి వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హైకోర్టు కూడా నిమ్మగడ్డకు అనుకూలంగా స్పందిస్తూ అధికారాలు వాడుకోవాలని సూచించడంతో వైసీపీకి మరిన్ని సమస్యలు తప్పేలా లేవు.

కొరడా ఝళిపిస్తున్న నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికల పోరు ముందుకు సాగే కొద్దీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కొరడా ఝళిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో తనకు సర్వాధికారాలు ఉన్నాయని తెలిసినా, కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా తనపైనే విమర్శలు ఎక్కుపెడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులపై వరుసగా కొరడా ఝళిపిస్తున్నారు. అంతకుముందు రోజూ ప్రెస్మీట్లు పెట్టి తనపై విమర్శలు చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నియంత్రించిన నిమ్మగడ్డ.. ఇప్పుడు వైసీపీ మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఆంక్షలు విధించగలిగారు. వరుసగా నోటీసులు జారీ చేసి వారిని హైకోర్టుకు లాగారు.

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చుక్కలు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌తో ఎన్నికల నిర్వహణ విషయంలో విభేదించడంలో తప్పులేదు. కానీ ఓసారి ఎన్నికలకు కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఎన్నికలు కూడా జరిగిపోతున్న సమయంలో ఎస్ఈసీని లక్ష్యంగా చేసుకుని మంత్రులు చేస్తున్న విమర్శలకు నిమ్మగడ్డ తన అధికారాలతో చెక్ పడుతున్నారు. వరుసగా నోటీసులు జారీ చేయడం, వాటిపై వివరణ తీసుకుని మరీ ఆంక్షలు విధిస్తుండటంతో ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మగడ్డ పేరెత్తాలంటే బేజారవుతున్న పరిస్ధితి. ఎన్నికల వేళ ప్రత్యర్ధులపై రాళ్లేస్తే సరిపోయే దానికి అదే పనిగా ఎన్నికల కమిషన్‌పైనా రాళ్లు వేయడం ద్వారా ప్రజల్లో సైతం వీరు పలుచన అవుతున్న పరిస్ధితి.

నిమ్మగడ్డకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ఇప్పటికే కోడ్ ఉల్లంఘనల పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హైకోర్టు కూడా తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్నికల్లో అక్రమాలు, కోడ్ ఉల్లఁఘనలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని, ఇందుకు తన అధికారాలు వాడుకోవాలని ఆయనకు సూచించింది. దీంతో ఇప్పటికే అధికారపక్షంపై కొరడా ఝళిపిస్తున్న నిమ్మగడ్డ మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చెలరేగిపోతున్న మంత్రి పెద్దిరెడ్డిని నియంత్రించే విషయంలో ఎస్ఈసీ ఇకపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

నిమ్మగడ్డకు హైకోర్టుతో చెప్పించిన చంద్రబాబు
ఇప్పటికే పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అక్రమాల విషయంలో, అధికార పార్టీపై ఎస్ఈసీ మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ తాజాగా చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా నిమ్మగడ్డ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో హైకోర్టులో ఎస్ఈసీని చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు పిటిషన్లు వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు తనకున్న అధికారాలు వాడుకోవాలని నిమ్మగడ్డకు సూచించింది. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు నిమ్మగడ్డకు హైకోర్టులో పిటిషన్లు వేసి ఆదేశాలు ఇప్పించడం చర్చనీయాంశమవుతోంది. టీడీపీ క్యాంపు మనిషిగా వైసీపీ ఆరోపించే నిమ్మగడ్డ ఇప్పుడు టీడీపీ పిటిషన్లపై హైకోర్టు ఆదేశాలను అమలుచేయాల్సిన పరిస్ధితి ఎదురుకావడం విశేషం.