వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త మృతి, సీఎం జగన్ సంతాపం..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగభూషణరావు.. ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాగభూషణరావు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. రెడ్డి శాంతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగభూషణరావు మృతితో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఐఎఫ్ఎస్ అధికారిగా నాగభూషణరావు పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజర్వేటర్గా, డామన్ డయ్యూ టూరిజం డైరెక్టర్గా, పర్యావరణం, కాలుష్యం, అడవులు, ఇందనవనరుల శాఖలకు సంబంధించిన పలు విభాగాల్లో పనిచేశారు. పలువురు కేంద్ర మంత్రుల వద్ద ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు.
నాగభూషణరావు గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధికి చికిత్స తీసుకోగా.. క్యాన్సర్ పూర్తిగా నయమైంది. కానీ ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురవడంతో ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. నాగభూషణరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతికి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.