• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు బలి పార్ట్ 2 వస్తే చంద్రబాబు జైలుకే: 'ఏ ముహూర్తాన సీఎం అయ్యారో ఆ రోజు నుంచి కరువు'

By Nageswara Rao
|

కర్నూలు: ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యారో ఆ రోజు నుంచి కరువుతో బాధపడుతున్నామని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. కరువుకు ప్యాంటు, షర్టు వేస్తే అదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు నిరసనగా కర్నూలులో వైసీపీ అధినేత వైయస్ జగన్‌ చేస్తున్న జలదీక్షకు మద్దతుగా రెండో రోజు ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు వెళ్లే, డెల్టా మొత్తం ఎడారిలా మారిపోయిందని, లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటే ప్రకాశం బ్యారేజి ఎండిపోయిందని, కర్నూలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయని ఎద్దేవా చేశారు. ఇంతటి తీవ్రమైన కరువును పట్టించుకోకుండా తన కుటుంబ సభ్యులతో విహార యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు.

కరువుతో రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల నష్టం వస్తే కనీసం 400 కోట్లు కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని, ఇలాంటి పరిస్థితిలో కూడా ఎగువన అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఆమె అన్నారు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని తెలిసి కూడా చంద్రబాబు మాట్లాడటం లేదని మండిపడ్డారు.

చంద్రబాబుతో పాటే రాష్ట్రంలో మళ్లీ కరువు వచ్చిందని, గతంలో తొమ్మిదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లుగా కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీలో కరువు నిధులను కూడా వదలకుండా దోచుకుంటున్నారన్నారు. మజ్జిగ పేరుతో 39 కోట్లు విడుదల చేసి, హెరిటేజ్ మజ్జిగను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.

కరువు రాష్ట్రాల సీఎంలు అంతా ప్రధాని మోడీని కలిసి నిధుల విడుదల చేయాలని కోరుతుంటే ఈయన మాత్రం తాను దోచుకున్న డబ్బులు స్విట్జర్లాండ్‌లో తన బినామీల పేరిట దాచుకోడానికి వెళ్లారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో 115 టీఎంసీల కృష్ణా నీళ్లు మళ్లిస్తే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదని జగనన్న చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

 Ysrcp Mla Roja fires on chandrababu over drought situation in Andhra Pradesh

సీమ ప్రాజెక్టులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. గతేడాదిగా తెలంగాణలో పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరగుతుంటే ముఖ్యమంత్రి చంద్రాబుబు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహారిస్తున్నారే తప్ప నోరు విప్పి మాట్లాడటం లేదని అన్నారు.

డైరెక్టర్ రాజమౌళి మనకు బాహుబలి సినిమా చూపిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చంద్రబాబుకు బాబు బలి పార్ట్ 1 చూపించారని, అందుకే ఆయన హైదరాబాద్‌ నుంచి మూటాముల్లె సర్దుకుని విజయవాడ పారిపోయారని వ్యాఖ్యానించారు. బాబు బలి పార్ట్ 2 బయటకు వస్తే చంద్రబాబు జైల్లో ఉండక తప్పదని స్పష్టం చేశారు.

ఓటుకు నోటు కేసు కోసం కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, ఇక్కడ కేసీఆర్ దగ్గర రాయలసీమ ప్రాజెక్టులను తాకట్టు పెట్టేశారని అన్నారు. సీమ అంటేనే చంద్రబాబుకు కక్షని, తనకు ఓట్లేయలేదన్న కసితో సీమ మీద పగ తీర్చుకుంటున్నారని తెలిపారు. కమీషన్ల కోసం పట్టిసీమ ప్రాజెక్టుతో 1500 కోట్లను నీళ్లపాలు చేశారన్నారు.

తాము సమస్యలపై నిలదీస్తుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని, ఏడాదికి పైగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారని.. కానీ ఎమ్మెల్యేలను లాక్కున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తుందా? అని రోజా ప్రశ్నించారు. మీరు కాదు కదా.. మీ చంద్రబాబు కాదు కదా.. ఆయనను పుట్టించిన ఖర్జూరనాయుడుకు కూడా వైసీపీని ఖాళీ చేయించే దమ్ము లేదన్నారు.

జగన్ తరఫున ఒక మహిళా ఎమ్మెల్యేగా వార్ డిక్లేర్ చేస్తున్నానని, ఉప ఎన్నికలకు వెళ్తే నీ అభివృద్ధి ఏంటో, జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానం ఏంటో తెలుస్తుందని ఆమె అన్నారు. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారని అన్నారు.

జగన్ పార్టీ పెట్టిన కొత్తలో ఎంపీగా పోటీ చేస్తేనే 5.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబులో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.

English summary
Ysrcp Mla Roja fires on chandrababu over drought situation in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X