తిరుపతిలో జగన్కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ
సొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి, త్వరలో జరుగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరగబోతోందని జోస్యం చెప్పారు. రాజధాని అమరావతి సహా పలు నిర్ణయాలకు సంబంధించి జగన్ సర్కారుకు, కోర్టులకు మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవస్థలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా చేసిన కామెంట్లతో తాను విబేధిస్తున్నట్లు రఘురామ చెప్పారు. 'రాజధాని రచ్చబండ'లో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడియాన ఆయన ఈ మేరకు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
రాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -'జగనన్నతోడు’, వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామ

వైసీపీ నేతల్లోనూ విసుగు..
‘‘ఏపీలో కొత్త ఇసుక విధానం గురించి ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. తమకు అనుకూలంగా ఉండేవాళ్లకు రీచ్ లను అప్పగించే సాకుతో అంతర్జాతీయ సంస్థల బిడ్డింగ్ అన్నారు. కానీ ప్రక్రియను సాగదీస్తుండటంతో సాధారణ జనంతోపాటు వైసీపీ నేతలు, కార్యకర్తల్లోనూ విసుగు పెరిగిపోయింది. నెలల తరబడి ఇసుక దొరకని కారణంగా పనులు నిలిచిపోయి చనిపోయాయని, రూ.40వేలు ఇచ్చినా ఒక్క లోడూ దొరకట్లేదని బావురుమంటూ వైసీపీకే చెందిన సీనియర్ నాయకుడొకరు సెల్ టవరెక్కి ఆత్మహత్యకు ప్రయత్నించారు. కనీసం ఇసుకను కూడా అందించలేని ప్రభుత్వమని వైసీపీని ప్రజలు తిరస్కరించే ప్రమాదం లేకపోలేదు. ప్రజాసమస్యలను సీఎం జగన్ దృష్టికి తేవాలననదే నా తాపత్రయం. ఆయన పక్కన చేరిన సలహాదారులు తప్పుడు సమాచారం చెబుతున్నారు. సీఎం ఇకనైనా పారదర్శకంగా ఉండాలి.
బీజేపీ భారీ స్ట్రోక్: పవన్, జగన్కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?

తిరుపతిలో డ్యామేజ్..
ఉచితంగా దొరికే ఇసుకను అందరికీ అందించలేకపోతోన్న జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న మరో అనూహ్య నిర్ణయం కారణంగా రాబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో నష్టాన్ని చవిచూడబోతున్నది. రాష్ట్ర హైవేలు, ఇతర రోడ్డులపైనా 100 కిలోమీటర్లకు రూ.90 చొప్పున అదనపు ట్యాక్స్ వసూలు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఆ రోడ్లపై వెళ్లే వ్యక్తులెవరూ వైసీపీ ఓటు వేయరుగాక వేయరు. తిరుపతిలో ఆ ప్రభావం స్పష్టంగా చూడబోతున్నాం.

ఆ మాట జనమే చెబుతారు..
ఏ ఓట్ల కోసమైతే మనం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, స్కీములు అమలు చేస్తున్నామో, వాటి కోసం మళ్లీ జనాలపైనే ఇంతలా పన్నులు బాదడం కరెక్టేనా? రోడ్ ట్యాక్సులకుతోడు ఆస్తి పన్ను కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. దీని వల్ల లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, మిగతా వాళ్లకు పంచుతోన్న ఈ విధానంపై ప్రజలు తిరగబడతారు. ‘పన్నులు కట్టం దొబ్బేయండి..' అని జగన్ సర్కారు ముఖంమీదే చెబుతారు. మీకు ఇష్టం వచ్చినట్లు పన్నులు వేసి.. వాటితో నచ్చిన ఓట్లు కొనుక్కుంటానంటే నడవదని సీఎం గ్రహించాలి. ఇకపోతే,

నేతల భాషపై రాష్ట్రపతి సందేశం
గుజరాత్ వేదికగా బుధ, గురువారాల్లో స్పీకర్ల సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించిన ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ ఉపన్యాసంలో రాష్ట్రపతి ఒక కీలక విషయాన్ని చెప్పారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు మాట్లాడే భాష గురించి ఆయన నొక్కి చెప్పారు. నేతలు జనంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, మనల్ని అసహ్యించుకునేలా మాట్లాడొద్దని సూచించారు. ఆ సూచనను వైసీపీ నేతలు కూడా తలకెక్కించుకోవాలి. పిచ్చివాడుగుడు నేతలను ప్రోత్సహించరాదు. అసెంబ్లీలో, శాసన మండలిలోనూ వైసీపీ నేతలు చాలా దారుణంగా మాట్లాడారు. భాష విషయంలో సమయమనం పాటించాలని జగన్ ఇప్పటికైనా వైసీపీ నేతలకు చెప్పాలి. అంతేకాదు..

వెంకయ్య వ్యాఖ్యలు ఏపీకి వర్తించవు..
అదే స్పీకర్ల సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కీలక ప్రసంగం చేశారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం కోసం చూడరాదని, అవన్నీ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలని అంటూనే.. ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థ తన పరిధి దాటింటి వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోందని, కోర్టులు పరిధి దాటి తీర్పులు ఇస్తున్నాయని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఆయన ఏ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో తెలీదుగానీ, ఏపీలో మాత్రం న్యాయవ్యవస్థ ఒక్క శాతం కూడా తన పరిధి దాటలేదు. ఇక్కడ రాజ్యాంగాన్ని అతిక్రమించింది ముమ్మాటికీ జగన్ ప్రభుత్వమే. కాబట్టే సుప్రీంకోర్టులోనూ వ్యతిరేక తీర్పులు వచ్చాయి. వ్యవస్థల పరిరక్షణ గురించి మాట్లాడిన వెంకయ్యగారు జగన్ సర్కారును కూడా మందలించి ఉంటే బాగుండేది'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.