రామతీర్థం విధ్వంసం: మరో సంచలనం -జగన్పై మోదీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు -కేంద్ర బృందాలు
విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు ఒక పరంపరలా మారాయని ఆరోపిస్తూ వైసీపీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈ కుట్రలపై కేంద్ర బృందాలతో దర్యాప్తు చేయాలని కోరుతూ, ఏపీలోని హిందువులను కాపాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ బుధవారం ఒక లేఖ రాశారు. అందులోనే సీఎం జగన్ పైనా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్పై ఆగ్రహాం

రామతీర్థంలో రాముడి మెడ తెంచి..
ఏపీలోనేకాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన (విజయనగరం జిల్లాలోని) పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ రాజకుమారి నేతృత్వంలో పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామన్న ఎస్పీ.. నిందితులను పట్టుకుంటామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సీఎం జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించడానికి కొద్ది గంటల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే..

పథకం ప్రకారమే విధ్వంసం..
రామతీర్థం బోడి కొండపై కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని, ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గతంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడే నిందితులను పట్టుకుని శిక్షించి ఉంటే దుశ్చర్యలు పునరావృతం అయిఉండేవి కావని, ఏపీలో మనుషులతోపాటు దేవతా విగ్రహాలకూ భద్రత లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకువేసి రామతీర్థం ఘటన, ఏపీలో ఆలయాలపై వరుస దాడుల వ్యవహారాన్ని కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు...

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ
రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం తల నరికి తీసుకువెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ సిగ్గుపడాలని, అదే జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకువెళితే క్షణాల్లో పట్టుకుంటారని, హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసినా జగన్ సర్కారు నేరస్తులను పట్టుకోవడం లేదని, తద్వారా సీఎంకు హిందువుల పట్ల చులకనభావం చూపుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఆరోపించారు. ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడుల జరుగుతోన్న తీరును, వాటికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవారిపై బలప్రయోగం జరుగుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఏపీలోని హిందువులకు మోదీనే దిక్కంటూ బుధవారం ప్రధానికి ఒక లేఖ రాశారు..

జగన్ 18 నెలల్లో 100కుపైగా ఆలయాల్లో
‘‘ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. 18 నెలల కాలంలో ఏకంగా 100కుపైగా ఆలయాల్లో విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. దాడులకు గురైన ఆలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. మూడు ఆలయాల్లో రథాలను తగులబెట్టారు. రాష్ట్రంలోని హిందువులు దేవుడికి పూజలు చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీ హిందువులను మీరే కాపాడాలి..

రామతీర్థం హిందువులదే కాదు..
హిందూ ఆలయాలపై దాడుల పరంపరలో తాజాగా విజయనగరం జిల్లాల్లోని రామతీర్థం టార్గెట్ అయింది. ఇక్కడి కోదండరామ ఆలయాన్ని క్రీస్తుశకం 3వ శతాబ్దంలో స్థాపించినట్లు ఆనవాళ్లున్నాయి. రామతీర్థం ఆలయ పరిసరాల్లోనే బౌద్ధ, జైన మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన ఆలయంలో శ్రీరాముడి విగ్రహాం శిరస్సును ఖండిచిన దుండగులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసనలకు దిగితే.. వారిపై జగన్ సర్కారు దమనకాండకు దిగుతున్నది.

జగన్ పుట్టినరోజు.. దేవుడి విగ్రహాల ధ్వంసం
రామతీర్థంలో దేవతామూర్తులను ధ్వంసం చేయడంపై హిందువులు తెలపకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. అదేమంటే కరోనాను సాకుగా చెబుతున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం కొద్ది మందితో నిరసన చేస్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు, సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకు మాత్రం వేలాది మందికి రోడ్లపై ర్యాలీలు తీయడానికి అనుమతులు ఇచ్చారు. జగన్ పుట్టిన రోజుకు లేని కరోనా అడ్డు.. దేవుడి విషయంలోనే ఎందుకు ఉంటున్నదో ఆలోచించాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల విధ్వంసాలపై వెంటనే కేంద్ర బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలి''అని ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు. గతంలో పలు మార్లు ఎంపీ రాసిన లేఖపై ప్రధాని కార్యాలయం స్పందించిన దరిమిలా త్వరలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.
సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్డౌన్ నష్టాన్ని భరిస్తూ..