తిరుపతి ఉపఎన్నిక: వైసీపీకి షాక్ -బల్లి కుటుంబానికి అన్యాయం -‘క్రిస్మస్’ కుట్ర: వైసీపీ ఎంపీ ఆరోపణలు
సొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అనర్హత వేటు అంశం ఎటూ తేలకపోవడంతో అదే పనిగా విమర్శలు కురిపిస్తోన్న నర్సాపురం ఎంపీ.. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలల తరబడి వాయిదా పడుతోన్న ఇళ్ల పట్టాల పంపిణీని క్రిస్మస్ పండుగనాడే నిర్వహించడం వెనుక కుట్రదాగుందని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
జగన్కు సెగ గడ్డలా నిమ్మగడ్డ -కుక్క అనడం కొడాలి నాని తప్పుకాదు :ఎంపీ రఘురామ అనూహ్యం

ఆ పేరుతో సెన్సేషన్..
‘‘రాష్ట్రంలో స్థానిక ఎన్నిక నిర్వహణకు మోకాలడుత్తోన్న వైసీపీ, సీఎం జగన్లు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు మాత్రం పలు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన తిరుపతి బైపోల్ కు సంబంధించి తాజాగా సెన్సేషనల్ వార్త ఒకటి బయటికొచ్చింది. మూడేళ్ల కిందట జగన్ పాదయాత్ర చేసిన సమయంలో.. ఆయన ఒంటిని కాపాడుతూ, కాళ్లకు కట్లు కడుతూ, అన్ని రకాలుగా సహాయకారిగా వ్యవహరించిన ఫిజియోథెరపీ డాక్టర్ గురుమూర్తికి వైసీపీ తరఫున ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే గనుక తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి షాక్ తప్పదు. ఎందుకంటే..
జగన్-చంద్రబాబుకు చెక్: 2024కంటే ముందే జమిలి ఎన్నికలు -జనసేనదే అధికారం: పవన్ కల్యాణ్

దుర్గాప్రసాద్ కుటుంబానికి అన్యాయం..
దివంగత తిరుపతి ఎంపీ, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీలో అందరికీ కావలసిన మనిషి. దురదృష్టవశాత్తూ కరోనా వల్ల ఆయన కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్సార్ బతికున్నప్పుడుగానీ, తర్వాతికాలంలో వైఎస్ పేరుతో పార్టీ కొనసాగిస్తోన్న జగన్ గానీ ఉప ఎన్నికల విషయంలో ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. టికెట్ విషయంలో చనిపోయిన నేతల కుటుంబాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్.. తన ఒళ్లు నొప్పులు తగ్గించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలనుకోవడం ద్వారా బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. ఎంపీ టికెట్ కు బదులుగా మరోలా బల్లి కుటుంబానికి అవకాశం ఇస్తామంటున్నారు. కానీ..

రద్దయ్యే మండలిలో పదవా?
ఆంధ్రప్రదేశ్ లో అసలు శాసన మండలి అవసరమే లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జగన్, దానిని రద్దు చేసే ప్రక్రియలోనే ముందుకెళుతున్నారు. అలాంటప్పుడు దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడం అన్యాయం కాదా? ఒంటినొప్పులు తగ్గించిన డాక్టర్ కు ఎంపీ స్థాయి కల్పించాలనుకోవడం, ఎంపీ టికెట్ కు అర్హులైన దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇస్తామనడం ఏమేరకు సబబు? అందరికీ న్యాయం చేయడమే జగన్ ఉద్దేశమైతే, ఆ ఎమ్మెల్సీ పదవిని డాక్టర్ గురుమూర్తికే ఇవ్వొచ్చు కదా! సెంటిమెంట్ గానీ, మరే రకంగా చూసినా దుర్గాప్రసాద్ కుటుంబానికి జగన్ టికెట్ ఇవ్వకుంటే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి ఇబ్బందులు తప్పవు. ఇకపోతే..

జగన్ కొత్త పథకం..
అభివృద్ధిని పక్కనపెట్టేసి, సంక్షేమంతో బండిలాగుతోన్న జగన్ సర్కారు రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏపీలో పాడి రైతులకు పశువుల్ని ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిసింది. అమూల్ డైరీకి కేంద్రంగా, పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి ‘ఉచిత పశువుల పంపిణీ' పథకాలు లేవు. ఇప్పటికే ఉన్న పాడి రైతులకు అవసరమైన చర్యలు మెరుగుపర్చకుండా, కొత్త పథకాల పేరుతో చేసే ప్రయత్నాలు వ్యర్థం. మీరిచ్చే స్థలంలో ప్రజలు ఇల్లు కట్టుకొవాలా? పశువుల్ని పోషించుకోవాలా? అనే సందిగ్ధం ఏర్పడుతుంది. ఉన్న ప్రొడక్టివిటీని దెబ్బ తీసేలా, కేవలం కమిషన్ల కోసం ఇలాంటి పథకాలను ప్లాన్ చేయడం సరికాదు. ఇళ్ల స్థలాలంటే గుర్తొచ్చింది..

క్రిస్మస్ నాడే పట్టాల పంపిణీ ఓ కుట్ర
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ క్రిస్మస్ పండుగనాడే చేపట్టబోతున్నట్లు ప్రబుత్వం ప్రకటించింది. గత ఉగాది నుంచి మొదలు పెడితే ఆ పథకం ప్రారంభ తేదీలు మారుతూ వచ్చాయ. ప్రభుత్వం తీరు చూస్తుంటే కావాలనే నాటకాలు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. 90 లక్షల మంది లబ్దిదారుల్ని మతమార్పిడి దిశగా ప్రోత్సహించేందుకే క్రిస్మస్ రోజున పట్టాలు పంచాలని సీఎం భావిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 33వేల మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ. 14 కోట్ల చొప్పున ఏడాదికి రూ.717 కోట్లు భృతి ఇస్తున్నారు. ఆ క్రమంలోనే మతప్రచారం చేసేందుకే క్రిస్మస్ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని వ్యక్తిగతంగా నేను నిరసిస్తున్నాను. అవసరమైతే పథకం ప్రారంభోత్సవాన్ని జనవరి 1కి వాయిదావేయాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పాస్టర్లకు భృతి ఇవ్వడంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు ఫిర్యాదు చేశాను.'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.