రాజ్యసభ హైడ్రామా- విమర్శలతో వెనక్కితగ్గిన సాయిరెడ్డి- వెంకయ్యకు క్షమాపణలు
రాజ్యసభలో నిన్న చోటు చేసుకున్న అనూహ్య ఘటనల నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాజ్యసభలో ఆయన వ్యవహారశైలిపై, ముఖ్యంగా ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడం, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషీ మందలింపుతో ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యకు క్షమాపణలు చెప్పారు.


వెంకయ్యకు విజయసాయిరెడ్డి క్షమాపణ
రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న వెంకయ్యనాయుడిపై పరుష పదజాలంతో పాటు రాజకీయాలతో ముడిపెడుతూ చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గారు. కాంగ్రెస్, బీజేడీ, బీజేపీతో పాటు పలు పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో సాయిరెడ్డి వెనక్కి తగ్గక తప్పలేదు. చివరికి ఇవాళ ఉదయం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత రాజ్యసభ ఛైర్మన్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి, క్షమించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యను కోరారు.

ఆవేశపూరిత వ్యాఖ్యలు వెనక్కి
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై తాను చేసిన వ్యాఖ్యలు ఆవేశపూరితమే తప్ప ఉద్ధేశపూర్వకంగా చేసినవి కావని ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని సభకు సాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి సభకు వెల్లడించారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కూడా వీటిని అంగీకరించారు.

నిన్న రాజ్యసభలో జరిగింది?
నిన్న రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తన ప్రసంగంలో సీఎం జగన్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డి వెంటనే ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయితే దాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీంతో సాయిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. మీ మనసు బీజీపీతో హృదయం టీడీపీతో ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. ఇతర సభ్యులు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. దీంతో వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు తన మనసును బాధించాయన్నారు.

సాయిరెడ్డికి ప్రహ్లాద్ జోషీ మందలింపు
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై నిన్న సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తీవ్రంగా మందలించారు. అప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీజేడీ సభ్యులు సాయిరెడ్డి ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలకు పట్టుబట్టారు. దీంతో జోక్యం చేసుకున్న ప్రహ్లాద్ జోషీ...సాయిరెడ్డిని ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని మందలించారు. ఛైర్మన్‌ను క్షమాపణ కోరడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత సాయిరెడ్డి క్షమాపణలు కోరడంత పాటు వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు.