మళ్లీ కమలాన్ని కెలికిన సాయిరెడ్డి.. ఈసారి టార్గెట్ సుజనా.. తొలిసారి వైసీపీ-బీజేపీ మధ్య నెత్తుటి వేటు
కమలం జోలికి రావొద్దని బీజేపీ నేతలు పదే పదే హెచ్చరించినా.. బురద జోలికి వెళ్లకుండా ఉండలేనన్న చందంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారు. టీడీపీ మిడతల దండు బీజేపీని కబ్జా చేసిందని, చంద్రబాబు కోవర్టులతో బీజేపీ నిండిపోతోందంటూ కామెంట్లుచేసిన సాయిరెడ్డికి.. ఏపీ బీజేపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ బదులిస్తూ.. వైసీపీని కూడా ఏదైనా చేయగల సత్తా బీజేపీకి ఉందని, ముందు ఇంటిని కాపాడుకోవాలని హితవుపలికారు. అయినాసరే వైసీపీ ఎంపీ కమలనాథుల్ని ప్రస్తావిస్తూ మళ్లీ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో బీజేపీ-వైసీపీ మధ్య గొడవల్లో దాదాపు తొలిసారి నెత్తురుపారిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్.. సచివాలయం కింద నిజాం ఖజనా.. తేదీలతో రేవంత్ రెడ్డి సంచలనం..

జైలు పక్షులా చెప్పేది?
ఏపీ బీజేపీలో పాత నేతలను వదిలేసి, కొత్తగా చేరుతోన్న వాళ్లను.. అది కూడా టీడీపీ నుంచి వలస వస్తోన్నవాళ్లను వైసీపీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ, అనూహ్య ఆరోపణలు తెరపైకి తెస్తున్న దరిమిలా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి.. సాయిరెడ్డి కామెంట్లపై స్పందించారు. రేప్, దొంగతనం, హత్య లాంటి నేరాలు చేయనంత కాలం ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చని, బీజేపీ వ్యవహారాల గురించి మాట్లాడేముందు వైసీపీ నేతలు.. మరీ ప్రధానంగా జైలు పక్షులైన జగన్, సాయిరెడ్డిలు ఆచితూచి స్పందించాలని, వాళ్లు చేసిన నేరాలకు శిక్షలు తప్పవని అన్నారు. వైసీపీ సర్కారుతో బీజేపీ నేరుగానే పోరాడుతుందని, ఆ క్రమంలో ప్రతి కార్యకర్తకూ హైకమాండ్ అండగా ఉంటుందని, తనను టార్గెట్ చేయడం వైసీపీ వల్ల కాబోదని సుజనా చౌదరి అన్నారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ కామెంట్లు చేశారు.

బీజేపీ నేతలు నవ్వుకుంటున్నారు..
సుజనా చౌదరిని ఖండించేక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ బీజేపీని ప్రస్తావించారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన సుజనా.. అన్నీ తానే అన్నట్లు బిల్డప్ ఇస్తుండటం చూసి బీజేపీ నేతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కెమెరా ముందుకు వచ్చినప్పుడే సుజనా కాషాయమని, మేకప్ తీస్తే తన ఒరిజినల్ పచ్చపసుపేనన్నారు. ‘‘సుజనా చౌదరి మాటలు విని కొందరు బిజెపి నాయకులు నవ్వుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి.. మొత్తం ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే కమెడియన్ ని గుర్తు తెచ్చుకుంటూ అలా నవ్వుకుంటున్నారు..''అని సాయిరెడ్డి పేర్కొన్నారు.
విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్

తలకిందులుగా తపస్సు..
సుదీర్ఘ రాజకీయ, వ్యాపార జీవితం తాను ఏ తప్పూ చేయలేదని, అలాంటప్పుడు తననెవరూ టార్గెట్ చేయలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పుకున్నారు. దానికి సమాధానంగా సాయిరెడ్డి అనూహ్య కామెంట్లు చేశారు. ‘‘ఏంటి సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా ? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్ . బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి'' అని సవాలు విసిరారు.

విజయనగరంలో నెత్తుటి వేట..
ఉత్తరాంధ్ర జిల్లా విజయనరగంలో మంగళవారం రాజకీయ హింస పేట్రేగింది. విజయనగరం కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థి నారాయణరావుపై కొందరు వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. తమ పార్టీ నేతపై హత్యాయత్నం చేసింది వైసీపీ శ్రేణులేనంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారిని కలిసి, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ నిరంకుశత్వ పాలన సాగుతోందని, ఆక్రమణలు, ప్రజల ఆక్రందనలకు అంతులేకుండా పోయిందని బీజేపీ విమర్శించింది.

సభ్య సమాజానికే సిగ్గుచేటు..
విజయనగరం బీజేపీ మున్పిపల్ అభ్యర్థి నారాయణరావుపై వైసీపీ కార్యకర్తలు కిరాతకంగా దాడి చేశారని, ఇలాంటి చర్యలు సభ్య సమాజానికే సిగ్గుచేటని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి నిదర్శనమే ఈ హత్యాయత్నమని మరో ఎంపీ సుజనా మండిపడ్డారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఘటనలు గర్హనీయమని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నారాయణరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.