బిపిన్ రావత్ భౌతిక కాయానికి వైసీపీ ఎంపీల నివాళి: వీరయోధుడిగా
న్యూఢిల్లీ: తమిళనాడులో సుళ్లూర్-కూనూర్ మధ్య వైమానిక దళానికి చెందిన ఎంఐ వీ5 హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో కన్నుమూసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ భౌతిక కాయాలకు పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. తుది వీడ్కోలు పలుకుతున్నారు. దేశ రాజధానిలో కంటోన్మెంట్ ఏరియాలో గల బిపిన్ రావత్ నివాసానికి బారులు తీరారు. భరతమాత ముద్దుబిడ్డగా, వీర యోధుడిగా ఆయనను స్మరించుకుంటున్నారు.

అంత్యక్రియలకు
ఇవ్వాళ ఆయన వారి భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించనున్నారు ఆర్మీ అధికారులు. యూనిట్ 5/11 గోర్ఖా రైఫిల్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. బుధవారం మధ్యాహ్నం తమిళనాడులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో గ్రూప్ కేప్టెన్ వరుణ్ సింగ్ మినహా మరెవరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు. అందులో ప్రయాణిస్తోన్న 14 మందిలో బిపిన్ రావత్, మధులికా రావత్ సహా 13 మంది కన్నుమూశారు.

ప్రధాని సహా
వారి మృతదేహాలను తొలుత వెల్లింగ్టన్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం గురువారం రాత్రి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో దేశ రాజధానికి తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఈ ఉదయం కంటోన్మెంట్ ఏరియాలోని బ్రార్ స్క్వేర్ వద్ద త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాళి అర్పించారు.

ప్రముఖులు నివాళి..
అనంతరం భౌతిక కాయాన్ని బిపిన్ రావత్ నివాసానికి తరలించారు. అక్కడ ఆయన ఇద్దరు కుమార్తెలు కృతిక, తరిణి సందర్శించారు. తమ తల్లిదండ్రులకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో కాంగ్రెస్ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గె, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ నివాళి అర్పించారు. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ రాయబారులు ఎమ్మానుయెల్ లెనియాన్, నావోర్ గిలాన్ బిపిన్ కుమార్, మధులిక రావత్‌కు తమ దేశాల తరఫున తుది వీడ్కోలు పలికారు.

వైసీపీ ఎంపీల నివాళి..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ సభ్యురాలు వంగా గీత.. నివాళి అర్పించారు. మృతదేహాల వద్ద పుష్పాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మౌనం పాటించారు. అనంతరం విజయసాయి రెడ్డి- బిపిన్ రావత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొద్దిరోజుల కిందటే పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశాల సందర్భంగా తాను బిపిన్ రావత్‌ను కలుసుకున్నానని అన్నారు.
దురదృష్టకర ఘటనగా..
దేశం పట్ల ఎనలేని గౌరవం, భక్తి ప్రపత్తులు ఆయనలో ఉన్నాయని పేర్కొన్నారు. దేశం ఓ వీర యోధుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, కణిమోళి.. బిపిన్ రావత్, మధులిక రావత్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆయన కన్నుమూసిన పరిస్థితులు అత్యంత దురదృష్టకరమైనవిగా పేర్కొన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.