ముహుర్తం ఫిక్స్ చేసిన ఎంపీ రఘురామ.. సాయిరెడ్డికి మళ్లీ షాకిస్తూ.. ఎన్నికల సంఘం ఏమందంటే..
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం మరో మలుపు తిరిగింది. సొంత పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు చట్టబద్ధత లేదంటూ ఆయన చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. శుక్రవారం ఢిల్లీలోని సీఈసీ కార్యాలయంలో దాదాపు గంటన్నరపాటు గడపిన ఎంపీ రఘురామ.. శనివారం మరోసారి అధికారుల్ని కలవనున్నట్లు తెలిపారు. షోకాజ్ నోటీసుల చట్టబద్ధతపై క్లారిటీ వచ్చినా, రాకున్నా సీఎం జగన్ మీద గౌరవంతో సమాధానమిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ముహుర్తాన్ని కూడా ఖరారు చేసిన ఆయన.. ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు.
చెల్లి, తల్లి, ఆలిని తెచ్చింది మీరు కాదా?.. జగన్, సాయిరెడ్డిపై బుద్ధా ఫైర్.. విశాఖలో రాసలీలలంటూ..

ఈసీ ఏం చెప్పిందంటే..
శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయగా, షోకాజ్ నోటీసులు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జారీ అయ్యాయని, ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన వైసీపీకి విజయసాయి రెడ్డి జాతీయ కార్యదర్శి ఎలా అవుతారని, పార్టీ క్రమశిక్షణ కమిటీకి గుర్తింపు ఉందా లేదా అనే అంశాలను లేవనెత్తారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని ఈసీ అధికారులు చెప్పారని, ఆమేరకు లేఖ రాయాల్సిందిగా సూచించారని, లేఖతో శనివారం మరోసారి ఈసీని కలుస్తానని రఘురామ వెల్లడించారు.
లోకేశ్ ‘పెళ్లాం' కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి..

29న మధ్యాహ్నం 12గంటలకు..
వైసీపీ నుంచి ఎన్నికైన అందరు ఎంపీల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత విధేయుడిగా ఉండేది తానేనని, అలాంటిది కొందరి కుట్రల కారణంగానే కలహాలు చెలరేగాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. షోకాజ్ నోటీసుల చట్టబద్ధతపై ఎన్నికల సంఘం ఆదేశాలతో సంబంధం లేకుండా.. పార్టీకి సమాధానం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ‘‘సీఎం జగన్ పై గౌరవంతో షోకాజ్ నోటీసులపై.. ఈనెల 29న మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం చెబుతాను''అని ముహుర్తాన్ని ఖరారుచేశారు.

నన్ను బూచోడిలా చూస్తున్నారు..
వైఎస్ జగన్ నాయకత్వాన్ని శిరసావహిస్తానని, పార్టీతో తనకు ఎలాంటి విబేధాలుగానీ, వివాదాలుగానీ లేవన్న రఘురామ.. విజయసాయి రెడ్డి వల్లే సమస్యలు తలెత్తాయని, ఎందుకో సాయిరెడ్డి తనను ఓ బూచోడ్ని చూసినట్టు చూస్తున్నారని వాపోయారు. తామిద్దరం ఎంపీలే కావడంతో పార్టీ పరమైన కమిటీలకు సారధ్య బాధ్యతలు అప్పగించారని, కాలక్రమంలో తాను ఒకే కమిటీకి చైర్మన్ గా ఉండిపోగా.. సాయిరెడ్డికి మాత్రం ఎన్నో పదవులు లభించాయని కృష్ణంరాజు వివరించారు.

జగన్ దర్శనమే దొరకదు..
‘‘విజయసాయిరెడ్డి ప్రతి రోజూ సీఎం జగన్ తో గంటలకొద్దీ గడుపుతారు. కానీ మాకు మాత్రం మూడు నెలలకు ఒకసారైనా సీఎం దర్శనభాగ్యం లభించదు. ఎలా చూసినా పార్టీలో విజయసాయిరెడ్డి చాలా చాలా పెద్ద వ్యక్తి. పార్టీకి జనరల్ సెక్రటరీ కూడా. నేను మాత్రం చాలా చిన్నవాణ్ని. నాకు వైసీపీ సభ్యత్వం ఎవరిచ్చారో కూడా తెలీదు. ఇంత చిన్నవాణ్నైన నాపై.. అంత పెద్దోడైన సాయిరెడ్డి పగబట్టడం నా దురదృష్టం. బహుశా పార్టీలో మాది కలతల కాపురం అనుకుంటా. సమస్యను ఎలా సరిదిద్దుకోవాలా అని మాత్రమే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నా'' అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.