వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాము చావదు.. కర్ర విరగదు- అగమ్యగోచరంగా రఘురామ- ఢిల్లీ మకాంపై జనం గుర్రు....

|
Google Oneindia TeluguNews

వైసీపీ తరఫున గతేడాది ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపైనే పోరు ప్రారంభించిన కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ వెళ్లిపోయారు. వైసీపీ నేతల నుంచి ముప్పు పొంచి ఉందన్న సాకుతో అప్పట్లో ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామ రాజు ఇప్పటికీ హస్తిన వీడేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఆయనకు ఓటేసిన నరసాపురం ప్రజలు ఎంపీ తీరుపై మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, నేతలతో యుద్ధం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, అంతే కానీ ఓటేసిన తమను పట్టించుకోకుండా తప్పించుకుని తిరగడమేంటనని వారు మండిపడుతున్నారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఢిల్లీ వెళ్లిన రఘురామ మళ్లీ కోడిపందాల సమయానికే నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీని వీడని రఘురామకృష్ణంరాజు...

ఢిల్లీని వీడని రఘురామకృష్ణంరాజు...

వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే నిత్యం విమర్శలకు దిగుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు గతేడాది చివర్లో వైసీపీ నేతలపై పోరు ప్రారంభించారు. ఇది కాస్తా ముదిరి ప్రభుత్వం దాకా వచ్చింది. చివరికి సీఎం జగన్‌కు కూడా వదిలిపెట్టకుండా విమర్శలు మొదలుపెట్టిన రఘురామ ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. విమర్శలపై స్పందించిన వైసీపీ అధిష్టానం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి సస్పెన్షన్ వేటు వేయాలని కోరినా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఈ మధ్యలో గతేడాది సంక్రాంతి తర్వాత ఢిల్లీ వెళ్లిపోయిన రఘురామ అక్కడి నుంచే విమర్శలు కొనసాగించారు. అక్కడే ఉంటూ వైసీపీ నేతల నుంచి తనకు భద్రత లేదని, కేంద్రం నుంచి వై ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ కూడా పొందారు. అయినా ఇప్పటికీ ఢిల్లీ వీడటం లేదు.

వైసీపీ ఫిర్యాదు పట్టించుకోని స్పీకర్‌

వైసీపీ ఫిర్యాదు పట్టించుకోని స్పీకర్‌

తమ పార్టీ తరఫున గెలిచి తమపై, ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్న రఘురామకృష్ణంరాజును ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని లోక్‌సభ స్పీకర్‌ను వైసీపీ ఎంపీలు కోరారు. అయితే ఈ ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా స్పందన లేదు. పరిస్ధితి చూస్తుంటే మరో నాలుగేళ్లు పదవీకాలం కూడా రఘురామ పూర్తి చేసుకునేలా ఉన్నారు. సరిగ్గా ఇదే ఆరోపణలపై రాజ్యసభ నుంచి సీనియర్‌ ఎంపీ శరద్‌ యాదవ్‌పై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేశారు. అదే లోక్‌సభకు వచ్చేసరికి స్పీకర్‌ ఓం బిర్లా మాత్రం ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో రఘురామరాజు ఎంచక్కా ఢిల్లీ నుంచే రోజూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల బులిటెన్‌ వినిపిస్తున్నారు.

బీజేపీ అండతోనే వైసీపీపై విమర్శలు..

బీజేపీ అండతోనే వైసీపీపై విమర్శలు..


బీజేపీలోకి వెళ్లాలన్న టార్గెట్‌తోనే వైసీపీపై విమర్శలు మొదలుపెట్టిన రఘురామరాజు ఇప్పటికీ వాటిని కొనసాగించడం వెనుక బీజేపీయే ఉందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని టార్గెట్‌ చేస్తూ రఘురామ రాజు విమర్శలు చేస్తున్నా, మధ్యమధ్యలో బీజేపీ అజెండాతో పనిచేస్తున్నా కమలనాథుల నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందన లేదు. అటు లోక్‌సభలో పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకున్నా, బయట వైసీపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగుతున్నా రఘురామ రాజుపై ఎలాంటి చర్యలు లేవు. దీనికి అదనంగా వై కేటగిరీ భద్రత కూడా కల్పించారు. కేవలం ఢిల్లీ ఇంటికే పరిమితమవుతున్న రఘురామ రాజుకు కేంద్ర హోంశాఖ కల్పించిన వై కేటగిరీ భద్రత కూడా విమర్శలకు తావిస్తోంది. అయినా కమలనాథులు ఇదంతా చూసీచూడకుండా వ్యవహరిస్తున్నారు.

మండిపడుతున్న నరసాపురం ప్రజలు..

మండిపడుతున్న నరసాపురం ప్రజలు..

గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ తరఫున గెలిపిస్తే దానికి విరుద్ధంగా తమ మనోభావాలను పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలకు దిగుతున్న రఘురామరాజుపై జనం మండిపడుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీకే పరిమితం కావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీతో పేచీ ఉంటే వారితో తేల్చుకుంటే సరిపోతుందని, కానీ ఓటేసిన తమను పట్టించుకోకుండా తప్పించుకుని తిరగడమేంటని నరసాపురం నియోజకవర్గంలో జనం ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి వై కేటగిరీ భద్రత తీసుకున్నా నరసాపురం వచ్చేందుకు రఘురామరాజు ఇష్టపడకపోవడం చూస్తుంటే ఆయన పదవీకాలం పూర్తయ్యాకే ఇక్కడికి వస్తారా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అయినా ఆయన ఇవేవీ లెక్కచేయడం లేదు.

English summary
ysrcp rebel mp from narasapuram constituency of andhra pradesh raghurama krishnam raju have been confined to delhi amid row with his own party leaders and govt also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X