నాపై అనర్హత వేటా ? సమస్యే లేదన్న రఘురామ-బొచ్చులో నాయకత్వం వ్యాఖ్యపై క్లారిటీ
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిరంతరం పోరాడుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై దాఖలైన అనర్హత వేటు ఫిర్యాదుపై లోక్ సభ కమిటీ సమావేశమైన నేపథ్యంలో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. రఘురామ రాజుపై తాము ఇచ్చిన ఫిర్యాదుపై ఇఫ్పటికే చాలా ఆలస్యమైందని, ఇప్పటికైనా వేటు వేయాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ కమిటీ ముందు వాదించారు. అయితే తనపై వేటు వేయించడం అసాధ్యమని రఘురామ మరోసారి స్పష్టం చేశారు.

రఘురామపై అనర్హత వేటు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజుపై అనర్హత వేటు వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. రెండేళ్ల క్రితమే వైసీపీ నుంచి ఫిర్యాదు వచ్చినా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఫిర్యాదుల కమిటీ సమావేశమై రఘురామరాజు వ్యవహారాన్ని చర్చించింది. ఈ భేటీకి హాజరైన వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. రఘురామపై చర్యల విషయంలో మరోసారి తన వాదన వినిపించారు. ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రఘురామ స్పందించారు.

అనర్హత ప్రశ్నే లేదన్న రఘురామ
తాను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉల్లంఘించలేదని, అలాంటప్పుడు లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసే ప్రశ్నే తలెత్తదని రఘురామరాజు స్పష్టం చేశారు. తనపై వైసీపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన లోక్ సభ కమిటీ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని వైసీపీ నాయకత్వం చెప్పినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా మరేవిధంగా ప్రభావితం చేయాలని చూసినా తనను చేయగలిగిందేమీ లేదని రఘురామ తేల్చిచెప్పారు.

వైసీపీకి ఆ అర్హత లేదన్న రెబెల్ ఎంపీ
విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు, ఎంపీ మార్గాని భరత్‌కు ఉందా అని రెబెల్ ఎంపీ రఘురామ ప్రశ్నించారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకొని నిస్సిగ్గుగా తిరుగుతున్నా వారిపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదని రఘురామ ప్రశ్నించారు. తానేమీపార్టీ మారలేదని, పార్టీలోనే ఉంటూ ప్రశ్నిస్తుంటే వేటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉందని రెబెల్ ఎంపీ ఆక్షేపించారు.

జారీ చేయని విప్ ఉల్లంఘనా ?
పార్లమెంటులో తాను విప్ ఉల్లంఘించినట్లు తప్పుడు మాటలు చెబుతున్నారని, అసలు ఇప్పటి వరకూ వైసీపీ పార్లమెంటులో విప్ జారీ చేయలేదని రఘురామ గుర్తుచేశారు. విప్ జారీ చేయనప్పుడు దాన్ని ధిక్కరించానన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. రాజ్యాంగంలోని 350 ఏ అధికరణ ఏమి చెబుతుందో వైసీపీకి తెలియదన్నారు. ఆ అధికరణ ప్రకారం మాతృభాషను ప్రోత్సహించాలని, తాను అదే విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించానన్నారు. అక్కడ ఏ రకంగానూ తాను రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదని రఘురామ తెలిపారు. తన మాటలన్నీ సభ రికార్డుల్లో పదిలంగానే ఉన్నాయని గుర్తుచేశారు.

బొచ్చులో నాయకత్వంపై క్లారిటీ
గతంలో బొచ్చులో నాయకత్వం అని తాను జగన్‌రెడ్డిని ఉద్దేశించి అనలేదని రఘురామకృష్ణంరాజు వివరించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ ఇచ్చిన హామీల మేరకు తాము అధికారంలోకి వచ్చామమని, కానీ సీఎంగా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. పోలీసుల దాష్టీకానికి భయపడి ప్రజలెవరూ మాట్లాడకపోయినా పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో తన లాంటి వారు మాట్లాడితే తప్పు పట్టడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తనకు ఉందన్నారు. ఒకవేళ పార్టీ అధ్యక్షుడినే విమర్శిస్తున్నానని, పార్టీ విధివిధానాలను ఉల్లంఘిస్తున్నానని అనుకుంటే పార్టీ నుంచి బహిష్కరించవచ్చని సూచించారు.