raghurama krishnam raju yv subbareddy ysrcp andhra pradesh narsapuram ys jagan వైవీ సుబ్బారెడ్డి వైసీపీ ఆంధ్రప్రదేశ్ నర్సాపురం వైఎస్ జగన్ politics
వెనక్కి తగ్గిన వైసీపీ రెబల్ ఎంపీ... 2వేల మందితో దాడికి కుట్ర అంటూ.. సంచలన ఆరోపణలతో పర్యటన రద్దు...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వెనక్కి తగ్గారు. నర్సాపురంలో పర్యటించబోతున్నట్లు ప్రకటన చేసిన 24గంటల్లోపే పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. వైసీపీ శక్తులు తనపై కుట్ర పన్ని అక్రమంగా అరెస్టుకు రంగం సిద్దం చేశాయని... అందుకే పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఫేస్బుక్లో వెల్లడించారు. వైసీపీ దీన్ని తమ తాత్కాలిక విజయంగా భావించవచ్చునని... కానీ చివరాఖరికి ప్రభుత్వంపై ఇదో టైమ్ బాంబుగా మారుతుందని హెచ్చరించారు. ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారవద్దని వైసీపీ శ్రేణులకు సూచించారు.

ఆ ఇద్దరు కలిసి కుట్ర చేశారని...
నర్సాపురంలో శుక్రవారం(ఫిబ్రవరి 26) జరగాల్సిన పర్యటనను అడ్డుకునేందుకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,మంత్రి శ్రీరంగనాథ రాజు కలిసి కుట్ర పన్నారని రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. దీనికి సంబంధించి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి భీమవరం వెళ్లేదారిలో సిద్దాంతం వద్ద 2వేల నుంచి 3వేల మంది మనుషులను పెట్టి తనపై దాడికి ప్లాన్ చేశారని ఆరోపించారు. దీనికి పోలీసుల మద్దతు కూడా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

అకారణంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు : రఘురామ
ఎవరైనా సరే నచ్చిన మతం స్వీకరించే హక్కు రాజ్యాంగం కల్పించిందని...కానీ మతం మార్చుకుని కూడా రిజర్వేషన్లు పొందుతున్నవారిపై తాను రాష్ట్రపతికి,ప్రధానికి,కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. ఇలా దళిత హిందూ సోదరుల హక్కుల కోసం పోరాడుతున్న తనపై అకారణంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. వేల సంఖ్యలో జనాన్ని తీసుకొచ్చి తనపై జనం తిరగబడినట్లుగా సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారని చెప్పారు.

జగన్కు తెలిసే జరుగుతోందా?
ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలిసి జరుగుతోందా తెలియక జరుగుతోందా తనకు తెలియదన్నారు. సీఎంవో కార్యాలయాన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తే ఎవరూ అందుబాటులోకి రాలేదన్నారు.ఈ కుట్ర వెనుక జగన్ ఉన్నారో లేదో తెలుసుకునేందుకు శుక్రవారం మళ్లీ సీఎంవో కార్యాలయాన్ని సంప్రదిస్తానన్నారు. తనకు తెలిసి సీఎం జగన్ తనను అడ్డుకునేందుకు కుట్ర చేసేంత పిరికివాడు కాదని అన్నారు. అంత అధమస్థితికి ఆయన దిగజారరనే తాను భావిస్తున్నానన్నారు. ఒకవేళ అటునుంచి ఎటువంటి స్పందన లేకపోతే కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఆ తర్వాత చట్టపరమైన భద్రత నడుమ నియోజకవర్గంలోకి అడుగుపెడుతానని... ఆ తేదీని త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.

అడుగుపెట్టకముందే హీటెక్కిన రాజకీయం...
ఏడాదికాలంగా నర్సాపురం నియోజకవర్గానికి దూరంగా ఉన్న రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు సొంత ఇలాఖాలో రీఎంట్రీకి శుక్రవారం ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రఘురామ రీఎంట్రీ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. కానీ ఆయన ఎంట్రీ ఇవ్వకుండానే వైసీపీ శ్రేణులపై ఆరోపణలు చేస్తూ అర్ధాంతరంగా పర్యటనను రద్దు చేసుకోవడం గమనార్హం.
తప్పుడు కేసులు పెట్టించి తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నారని రఘురామ ఆరోపించిన నేపథ్యంలో దీనిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.