మారుతున్న వైసీపీ అజెండా ! సంక్షేమం నుంచి సామాజిక న్యాయానికి ? కారణాలివే
ఏపీలో మూడేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీల అమలు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఆర్ధిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా కరోనాలో సైతం హామీల అమలు ఆపలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్ని సంక్షేమ అజెండాతోనే వైసీపీ ఎదుర్కోబోతోందని భావిస్తున్న అందరికీ ఆ పార్టీ వైఖరి మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో సంక్షేమం కంటే సామాజిక న్యాయం అజెండాతోనే ఎన్నికల్ని ఎదుర్కోవాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీ సంక్షేమం
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత స్ధాయిలో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని భావిస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి సహకరిచకపోయినా అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది.
అయితే ఇంత చేస్తున్నా వైసీపీ ప్రభుత్వ సంక్షేమంపై క్షేత్రస్జాయిలో పూర్తిస్దాయిలో సంతృప్తి మాత్రం కనిపించడం లేదు. ఆర్ధిక ఇబ్బందులతో సంక్షేమంలో సర్కార్ విధిస్తున్న కోతలు, పథకాలపై పెడుతున్న కొత్త ఆంక్షలే ఇందుకు కారణం.

వైసీపీ సామాజిక న్యాయం
దేశంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలుకు సైతం వైసీపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల్ని టార్గెట్ చేసుకుని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పదవులు, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో పాటు అధికారంలో వారిని భాగస్వాముల్ని చేసేందుకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల కేటాయింపు వంటి వాటితో వైసీపీ సామాజిక అజెండాను భారీ ఎత్తున అమలు చేస్తోంది. దీంతో ఆయా వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా దీన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర కూడా చేపట్టారు.

సంక్షేమం నుంచి సామాజిక న్యాయానికి?
రాష్ట్రంలో సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం కూడా పెద్ద ఎత్తున వైసీపీ సర్కార్ అమలు చేస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏదో ఒక విషయాన్ని ఎన్నికల అజెండాగా మార్చుకోక తప్పని పరిస్దితి ప్రభుత్వానికి ఏర్పడుతోంది. తద్వారా ఎన్నికల అజెండాను ఇప్పటి నుంచే సెట్ చేసుకుని వచ్చే రెండేళ్లలో దానిపైనే పూర్తిగా దృష్టిపెడితే అధికారం నిలబెట్టుకోవడం అసాధ్యమేమీ కాదనేది వైసీపీ ఆలోచన.
దీంతో కొన్ని లోపాలతో, అసంతృప్తులతో సాగుతున్న సంక్షేమం కంటే పూర్తిస్ధాయిలో సంతృప్తి కనిపిస్తున్న సామాజిక న్యాయంవైపే వైసీపీ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే సంక్షేమం కంటే సామాజిక న్యాయాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రులతో బస్సు యాత్ర చేపట్టినట్లు అర్ధమవుతోంది.