నారాయణ అరెస్టు వెనుక ట్విస్ట్- నెరవేరిన వైసీపీ టార్గెట్- ఇక ఏం జరిగినా కూల్?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే తమ హిట్ లిస్ట్ లో ఉన్న ప్రైవేటు స్కూళ్లను టార్గెట్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబుకు ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న నారాయణ, చైతన్య విద్యాసంస్ధల్ని టార్గెట్ చేసింది. అయితే ప్రభుత్వం ఆశించినట్లు అందులో లొసుగులేవీ దొరక్కపోవడంతో అసహనం పెరుగుతూ వచ్చింది. చివరికి మూడేళ్ల తర్వాత నారాయణ విద్యాసంస్ధల అధినేత, మాజీ మంత్రి నారాయణను టెన్త్ పేపర్ల లీక్ కేసులో అరెస్టు చేసింది. అయితే దీని వెనుక అసలు ఉద్దేశం వేరని తెలుస్తోంది.

నారాయణ అరెస్టు రచ్చ
గత టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన నారాయణకు దశాబ్దాలుగా నారాయణ విద్యాసంస్ధల అధినేతగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతకు మించి టీడీపీ ఆర్ధిక మూలస్తంభాల్లో ఒకరిగా కూడా పేరుంది. ఈ రెండింటినీ మించి ర్యాంకుల పేరుతో విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్ధకు అధిపతిగా కూడా నారాయణ చెడ్డపేరు తెచ్చుకున్నారు.
అయితే గతంలో పలుమార్లు నారాయణను అమరావతి వ్యవహారాల్లో టార్గెట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వైసీపీ సర్కార్ .. ఆయన ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తోంది.
అదే సమయంలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం బయటికి రావడం, అందులో నారాయణ విద్యాసంస్ధల ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం నారాయణను హైదరాబాద్ కు పోలీసుల్ని పంపి మరీ అరెస్టు చేసింది. దీనిపై రాజకీయంగా రచ్చ సాగింది. అయితే నారాయణ బెయిల్ తో ఇది కాస్తా సద్దు మణిగింది.

నారాయణ కుటుంబానికీ బెయిల్
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నారాయణ తాను 2014లోనే నారాయణ విద్యాసంస్ధల ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్లు ఆధారాలు చూపడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీనిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. మరోవైపు నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరో 10 మంది నారాయణ సంస్ధ ఉద్యోగులు కూడా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసేందుకు ప్రభుత్వానికి వీల్లేకుండా పోయింది. ఈ వ్యపహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.


వైసీపీ ప్లాన్ నెరవేరిందా?
నారాయణ అరెస్టు వ్యవహారంలో పైకి ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినట్లు కనిపిస్తున్నా అంతిమంగా వైసీపీ టార్గెట్ మాత్రం నెరవేరినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో నారాయణపై అక్రమార్కుడిగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో ఇప్పటివరకూ ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయింది.
కానీ ఇప్పుడు పదో తరగతి పేపర్ల లీక్ వ్యవహారంలో మాత్రం నారాయణను అక్రమార్కుడిగా చూపుతూ అరెస్టు చేసింది. దీన్ని ఆయన కోర్టుల్లో సవాల్ చేయడం, బెయిల్ తెచ్చుకోవడం, దీనిపై ప్రభుత్వం అప్పీళ్లకు వెళ్లడంతో నారాయణపై రాష్ట్రవ్యాప్తంగా నెగెటివ్ చర్చ జరుగుతోంది. వైసీపీకి కావాల్సింది కూడా ఇదే. నారాయణపై లీకువీరుడిగా ముద్ర వేయడం ద్వారా వైసీపీ అనుకున్న టార్గెట్ నెరవేరినట్లే కనిపిస్తోంది.