ఆత్మకూరులో వాలంటీర్స్ ట్రయల్ సక్సెస్ ? 2024కు రిహార్సల్స్- వైసీపీ హ్యాపీ- విపక్షాల గుర్రు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మానసపుత్రిక అయిన వాలంటీర్ల వ్యవస్ధపై విపక్షాలు ముందునుంచీ గుర్రుగానే ఉన్నాయి. గతంలో వాలంటీర్లపై నేరుగా విమర్శలు చేసిన విపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన.. ఆ తర్వాత మౌనం వహించాయి. ఎన్నికల సందర్భఁగా వైసీపీకి మేలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం నియమించిన కార్యకర్తలుగా వీరిని విపక్షాలు అబివర్ణిస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా జరిగిన ఆత్మకూరు ఉపఎన్నికలోనూ వైసీపీకి వాలంటీర్లు పూర్తిగా సహకరించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల్ని లబ్దిదారులకు మరింత మెరుగ్గా అందించేదుకు వాలంటీర్ల వ్యవస్దను ఏర్పాటు చేశారు. నెలకు కేవలం 5 వేల రూపాయల గౌరవ వేతనంతో వాలంటీర్లను ప్రభుత్వం వాడుకుంటోంది. అయితే దీనికి మించి వారిని ఎన్నికల సమయంలో వాడుకుంటోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో జరిగిన స్ధానిక ఎన్నికల సమయంలోనూ వాలంటీర్లు వైసీపీకి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆత్మకూరు ఉపఎన్నిక రూపంలో వైసీపీకి వాలంటీర్లను వాడుకునే అవకాశం వచ్చింది. దీన్ని ఆ పార్టీ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆత్మకూరులో ట్రయల్ సక్సెస్
నిన్న జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ది మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపించేందుకు వాలంటీర్లు చురుగ్గా పనిచేశారని తెలుస్తోంది. సంక్షేమ పథకాలతో లింక్ చేసి ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు, దగ్గరుండి మరీ ఓట్లు వేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీకి ఆత్మకూరులో ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు పోతాయని వారు భయపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పలు చోట్ల ఎందుకొచ్చిన తంటా అని ఓటర్లు వైసీపీవైపే మొగ్గుచూపారని విపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో ఆత్మకూరులో వైసీపీ వాలంటీర్ల ట్రయల్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

2024 ఎన్నికలకు రిహార్సల్స్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లు తమకు అంచనాలకు మించి ఉపయోగపడతారని వైసీపీ భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్ధ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులకు ఆబ్లిగేషన్ గా మారిపోయింది. వాలంటీర్ల దయ లేకపోతే సంక్షేమ పథకాలు రావనే భయాలు లబ్దిదారుల్లో నెలకొన్నాయి. తాజాగా కోర్టులు సైతం లబ్దిదారుల్ని ఎంపిక చేయడానికి వాలంటీర్లు ఎవరంతూ ప్రశ్నించారు. దీంతో వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో ఏ స్ధాయిలో కీలకంగా ఉన్నారనేది అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు పనిచేశారన్న వాదన నిజమే అయితే 2024 కోసం వైసీపీకి ఇది రిహార్సల్ గా ఉపయోగపడుతుందనే అంచనాలున్నాయి.

విపక్షాల్లో పెరుగుతున్నఆందోళన ?
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు సంక్షేమ పథకాల నిర్వహణలో కీలకంగా ఉండేవి. ముఖ్యంగా జన్మభూమి కమిటీ ఎంపిక చేసిన లబ్దిదారులకే సంక్షేమం అందేది. కానీ ఇదే అదనుగా జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలతో టీడీపీకి చెడ్డపేరు రావడమే కాకుండా అధికారం కూడా కోల్పోయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల రూపంలో మరోసారి అలాంటి ప్రయోగమే చేస్తోంది. అదే సమయంలో టీడీపీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని వాలంటీర్ల వ్యవస్ధను పక్కాగా నిర్వహిస్తోంది. దీంతో ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీకి ఈ వ్యవస్ధ పూర్తిస్ధాయిలో పనికొస్తుందనే అంచనాలు పెరుగుతుండగా.. విపక్షాల్లోనూ ఆ మేరకు ఆందోళన పెరుగుతోంది.